మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను బరిలో దింపనున్నట్టుగా ప్రకటించిన కేసీఆర్.. అక్కడ మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమయ్యారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని మహారాష్ట్రలో విస్తరించడంపై దృష్టి సారించారు. మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను బరిలో దింపనున్నట్టుగా ప్రకటించిన కేసీఆర్.. అక్కడ మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పలువురు రైతు సంఘాల నాయకులు, ఇతర వర్గాల ప్రజలు బీఆర్ఎస్‌లో చేరుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్.. నాందేడ్, కాందార్ లోహాలో నిర్వహించిన బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
తాజాగా మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్)లోని ఆమ్ ఖాస్ మైదాన్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. మహారాష్ట్రలో నిర్వహించిన మొదటి రెండు సభలకు మంచి స్పందన లభించిందని.. ఇది పార్టీ మూడో బహిరంగ సభ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు. ఆమ్ ఖాస్ మైదాన్‌లో సభ జరుగుతుందని.. ఈ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారని ఆయన తెలిపారు. ఇక, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు మాణిక్ కదమ్‌లు ఆదివారం ఔరంగాబాద్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఔరంగాబాద్ నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో పెద్ద సంఖ్యలో నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఎండల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం పూట సభ జరిగే అవకాశం ఉంది. బేగంపేట విమానాశ్రయం నుంచి చార్టర్డ్ విమానంలో కేసీఆర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
బీఆర్‌ఎస్‌కు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల రైతులు, ఇతర వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కేసీఆర్ ఇటీవల చెప్పారు. దేశాన్ని నడిపించే నిజమైన నాయకుడి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవానికి మూడు రోజుల ముందు మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ నిర్వహించనుండం విశేషం.
ఇక, ఈ నెల 27న బీఆర్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. అదే రోజు తెలంగాణ భవన్‌లో(బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం) పార్టీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పార్టీ శ్రేణులకు పలు అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా పేరు మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఆవిర్బావ దినోత్సవం కావడంతో.. ఈ సమావేశంలో కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేస్తారనే ఆసక్తి కూడా నెలకొంది.