రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమే.. అవే రాష్ట్రాలకు రక్ష: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

By Sumanth Kanukula  |  First Published Nov 6, 2023, 10:38 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల యుగం రాబోతోందని అన్నారు.


తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల యుగం రాబోతోందని అన్నారు. ప్రజల బాధలను జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే అర్థం చేసుకోగలవని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటేనే.. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడవచ్చని అన్నారు. ఖమ్మం, కొత్తగూడెంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల పాలన ప్రజల ముందు ఉందని కేసీఆర్ అన్నారు. ‘‘నేను చెప్పేది నిజమేనని మీకు తెలుసు. నన్ను నమ్మండి. ప్రాంతీయ పార్టీలు తమ ప్రజల ప్రయోజనాలను మరింత మెరుగ్గా పరిరక్షించగలగడం వల్ల భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే కానుంది. తెలంగాణకు కాంగ్రెస్, బిజెపిలు ఏం చేశాయి?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. 

‘‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జాతీయ పార్టీలు మమ్మల్ని అవమానించాయి. వాళ్ళు (బీజేపీ, కాంగ్రెస్) ఎప్పుడైనా తెలంగాణా జెండా ఎగరవేశారా? తెలంగాణ పోరాటాన్ని ఎప్పుడైనా తమ భుజస్కంధాలపై వేసుకున్నారా? మేము తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించినప్పుడల్లా వారు మమ్మల్ని అవమానించారు. మాపై కాల్పులు జరిపారు. జైళ్లలో పెట్టారు. రాష్ట్రం పట్లవారికి ఎందుకు ప్రేమ ఉంటుంది’’అని కేసీఆర్ ప్రశ్నించారు. జాతీయ పార్టీలు ఢిల్లీలోని వారి హైకమాండ్ ఆధ్వర్యంలో పనిచేస్తాయని విమర్శించారు. ‘‘ఢిల్లీలోని ఈ 'గులామ్‌ల' (బానిసలు) కింద ఉండి మనం కూడా బానిసలుగా మారాలా? ప్రాంతీయ పార్టీల యుగం రాబోతుంది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 

Latest Videos

ఈ ఢిల్లీ బానిసలను ఎన్నుకుని బానిసలుగా మారాలనుకుంటున్నారా?  అని ప్రశ్నించారు. తెలంగాణకు మేలు చేసే పార్టీ కావాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ప్రజలు ఓటేసే ముందు ప్రతి రాజకీయ పార్టీ, నాయకులు చేసిన చరిత్ర, కృషిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ 50 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌ను పాలించిందని.. తెలంగాణ కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. కొత్త తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఎటువంటి సహకారం అందించలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్, నీటి కొరతను పరిష్కరించిందని.. సంక్షేమ పథకాలు అందిస్తోందని.. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని చెప్పారు. 

కాంగ్రెస్ హయాంలో ఖమ్మం పర్యటించినప్పుడు చాలా దారుణ పరిస్థితులు ఉండేవని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నగరాన్ని మార్చిందని కేసీఆర్ అన్నారు. గతంలో గోదావరి నది చూసి సంతోషపడటమే తప్ప.. గుక్కెడు నీళ్లు రాలేదని... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎష్ రికార్డు స్థాయిలో మూడోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. సీతా రామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తానని కేసీఆర్ ప్రకటించారు.
 

click me!