ఈడీ విచారణ వేళ కవిత ముఖంపై చిరునవ్వుకు కారణమిదే..: బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి వాదనిదే

By Arun Kumar PFirst Published Mar 22, 2023, 1:49 PM IST
Highlights

డిల్లీ లిక్కర్ స్కాం పై ఈడి విచారణ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. దీంతో తన అరెస్ట్ వుండదని తెలిసే కవిత అంత కాన్పిడెంట్ వున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 

న్యూడిల్లి : డిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాలను కుదిపేస్తూ కీలక నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. డిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుతో ఈ లిక్కర్ స్కాంతో సంబంధమున్న ఎవ్వరినీ వదిలిపెట్టరని అర్థం అయ్యింది. అలాంటిది తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత మాత్రం ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరైనా ఎప్పుడూ  ఒత్తిడిగా కనిపించలేదు. అరెస్టు చేస్తారంటూ ఎంత ప్రచారం జరిగినా కవిత ఈడీ కార్యాలయానికి వెళ్ళిన ప్రతిసారి చిరునవ్వుతో కనిపించారు. విచారణ ముగిసిన తర్వాత కూడా విక్టరీ సింబల్ చూపుతూ, అందరికీ అభివాదం చూస్తూ వెళ్ళిపోయేవారు. చివరకు ఆమె అరెస్ట్ ప్రచారానికి తెరదించుతూ ఈడి విచారణ ముగిసింది. 

తన అరెస్టు వుండదని ముందే తెలిసి కవిత ఇంత కాన్పిడెంట్ గా వుందని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం డిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఇరికించాలని చూస్తున్నారని... ఆమె స్కాంకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి అరెస్ట్ సాధ్యపడలేదని అంటున్నారు. కవిత కూడా తనకు లిక్కర్ స్కాం తో సంబంధం లేదు కాబట్టే అంత కాన్పిడెంట్ గా విచారణకు వెళ్లారని... ప్రతిసారి ముఖంపై చెరగని చిరునవ్వుతో తిరిగి వచ్చారని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. 

ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం డిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడి విచారించడం పొలిటికల్ ఎత్తుగడగా పేర్కొంటోంది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ల పాదయాత్ర నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈడీ విచారణ పేరిట హంగామా చేసారని అంటున్నారు. కవితను ఈడి అరెస్ట్ చేయదని ముందే తమకు తెలుసని అన్నారు.ఇదంతా పొలిటికల్ డ్రామా కాబట్టే కవిత కూడా నవ్వుతూ ఈడీ కార్యాలయానికి వెళ్లి నవ్వుతూ తిరిగి వచ్చారని అంటున్నారు. 

ఇక తెలంగాణ బిజెపి నాయకులు మాత్రం ఈడి విచారణ సమయంలో కవిత మేకపోతు గాంభిర్యం ప్రదర్శించారని అంటున్నారు. తన ఒత్తిడి బయటపడకుండా వుండేందుకే ముఖంపై చిరునవ్వుతో కనిపించారని అన్నారు. కానీ లిక్కర్ స్కామ్ లో తన ప్రమేయమేంటో కవితకు తెలుసని... అరెస్ట్ ఖాయమని బిజెపి నాయకులు చెబుతున్నారు. చిరునవ్వులు, విక్టరీ సింబల్స్ చూపినంత మాత్రాన కవిత ఈడీ నుండి తప్పించుకుంటారని అనుకుంటే అది పొరపాటేనని అంటున్నారు. 

ఇదిలావుంటే వరుసగా రెండ్రోజుల ఈడి విచారణ ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది పండగపూట హైద్రాబాద్ కు  చేరుకున్నారు. ఈడి విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల  19వ తేదీన కవిత  న్యూఢిల్లీకి వెళ్లారు. విచారణ ముగియడంతో ఇవాళ  ఉదయం  న్యూఢిల్లీ నుండి  ప్రత్యేక విమానంలో  కవిత  బృందం  హైద్రాబాద్ కు  బయలుదేరింది.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మూడు దఫాలు కవిత  ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.ఈ నెల  11,20, 21 తేదీల్లో  కవిత  ఈడీ విచారణకు  హాజరయ్యారు.  మరోసారి విచారణ  విషయమై ఈడీ నుండి సమాచారం లేకపోవడంతో  కవిత  న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్  కు చేరుకున్నారు. 
 

click me!