సినీ ఫక్కిలో దోపిడీ.. భార్యగా మెట్టినింటికీ.. అంతలోనే నగదు సర్దుకుని పరార్

By Mahesh KFirst Published Dec 21, 2021, 6:03 AM IST
Highlights

రంగారెడ్డి జిల్లా యాచారంలో సినీ ఫక్కిల దోపిడీ జరిగింది. ఏకంగా పెళ్లి చేసుకుని మెట్టినింటిలో అడుగు పెట్టి మరీ ఇంటి బీరువాలోని నగదును దోచుకెళ్లింది. యాచారం మండలానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి పెళ్లి సంబంధం కుదర్చాలని బ్రోకర్‌ను అడగ్గా.. ఆయన లక్ష రూపాయలు తీసుకుని విజయవాడలో అమ్మాయి ఉన్నదని వెంటతీసుకెళ్లాడు. ఆమెను చూసి ఓ లాడ్జీలో పెళ్లి చేసుకున్న ఆయన సతీసమేతంగా ఇంటికి బయల్దేరాడు. ఇంటికి వచ్చిన గంటల వ్యవధిలోనే నగదు దోచుకుని ఆ ‘వధువు’ పరారైంది.

హైదరాబాద్: రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో సినీ ఫక్కీలో దోపిడీ(Theft) జరిగింది. పక్కా పథకం ప్రకారం.. 40 ఏళ్ల బ్రహ్మచారిని పెళ్లి(Marriage) చేసుకుని ఇంట్లోకి దిగింది. మెట్టిన ఇల్లు చేరిన కొద్ది సేపటికే ప్లాన్ అమలు చేసింది. బీరువాలోని డబ్బును తన సంచిలోకి మార్చుకుంది. ఏమీ ఎరగనట్టు తన తోడు వచ్చిన యువతి సోదరుడిని కలవాల్సి ఉన్నదని అద్దె కారులో నగదుతో ఉడాయించారు. కారులో వెళ్తుండగానే దుస్తులు మార్చుకున్నారు. ఈ వ్యవహారంతో కారు డ్రైవర్ బిత్తరపోయాడు. ఇదేంటని అడిగితే.. డ్రైవర్‌నూ వారు బెదిరించి.. పరారయ్యారు. మోసపోయానని తెలుసుకున్న ఆ వ్యక్తి స్థానికులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో జరిగింది.

యాచారం మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా తిరస్కరిస్తూ పోయాడు. కొన్నేళ్లకు ఆయనకు పెళ్లి సంబంధాలు రావడమే ఆగిపోయాయి. దీంతో ఆయనే తిరిగి సంబంధాల వేటలో పడ్డాడు. అప్పటికే ఆయన 40వ పడిలో చేరాడు. దీంతో ఇటీవలే ఆయన ఓ మిత్రుడి సహకారంతో ప్రత్యేకంగా ఓ బ్రోకర్‌ను కలిశాడు. ఒక లక్ష రూపాయలు ఇస్తే సంబంధం కుదురుస్తానని బ్రోకర్ డిమాండ్ చేశాడు. అందుకు ఆయన అంగీకరించాడు. ఆ మొత్తాన్ని మధ్యవర్తికి చెల్లించాడు. ఒక అమ్మాయి ఉన్నదని బ్రోకర్ సదరు వ్యక్తికి చెప్పాడు.  ఆ అమ్మాయికి ఎవరూ లేరని, తనతోపాటు విజయవాడకు వస్తే ఆ సంబంధం ఖరారు చేసుకోవచ్చని అన్నాడు. ఇందుకు ఆ వ్యక్తి అంగీకరించాడు. ఓ మిత్రుడిని తీసుకుని మధ్యవర్తితో బయల్దేరి వెళ్లాడు.

Also Read: దొంగ భార్య అరెస్ట్.. మా పాపకు ఫిట్స్.. ఆమెకేమైనా అయితే ఎవరు చూసుకోవాలి’ అంటూ పోలీసులతో భర్త వాగ్వాదం..

విజయవాడకు వెళ్లి ఆ అమ్మాయిని చూశారు. గురువారం ఓ లాడ్జీలో వివాహం చేసుకున్నారు. ఆయన భార్యతో కలిసి యాదగిరి గుట్టకు వచ్చి వ్రతం కూడా చేశారు. హైదరాబాద్‌లో షాపింగ్ చేశారు. మూడు తులాల బంగారం, రూ. 40 వేల దుస్తులు కొనుగోలు చేశారు. చివరకు శుక్రవారం రాత్రి సుమారు 8.30 గంటల ప్రాంతంలో స్వగ్రామం చేరారు. ఇంటికి వచ్చిన వెంటనే పెళ్లి కూతురు ఏదో పనిలో బిజీగా ఉన్నట్టు వ్యవహరించింది. బీరువాలో దుస్తులు సర్దుతున్నట్టు నటించింది. అదే సమయంలో బీరువాలోని రూ. 2 లక్షలను తన బ్యాగులోకి మార్చుకుంది. ఆ తర్వాత కొత్త నాటకానికి తెర తీశారు. తనతో పాటు వచ్చిన యువతి సోదరుడిని కలవాల్సి ఉన్నదని పెళ్లి కూతురు ఆ వ్యక్తికి తెలిపింది. అద్దె కారు మాట్లాడుకున్నారు. ఇంతలోనే తనకు తలనొప్పి వచ్చిందని, మాత్రలు తేవాల్సిందిగా కోరింది. అతను ఇంటి బయట అడుగు పెట్టగానే వారు నగదుతో ఉడాయించారు.

ఆ ఇద్దరు నిందితులు కారులోనే దూర ప్రయాణానికి సిద్ధమయ్యారు. డ్రస్‌లు మార్చుకున్నారు. ఈ హడావిడితో కారు డ్రైవర్ ఖంగారు పడ్డాడు. కారులో దుస్తులు మార్చుకోవడాన్ని ఆయన ప్రశ్నించగా.. అతన్నే బెదిరించారు. ఎల్బీ నగర్ వద్ద కారు దిగారు. అక్కడి నుంచి విజయవాడకు పరారయ్యారు. కాగా, బాధితుడు తాను మోసపోయినట్టు గుర్తించగానే స్థానిక పెద్దలకు విషయం చెప్పాడు. మధ్యవర్తిని ఈ విషయమై నిలదీయగా.. తనకేమీ తెలియదని, ఆమె ఇంత పని చేస్తుందని ఊహించలేదని అన్నాడు. కాగా, ఇదంతా ఒక పక్కా ప్రణాళికతో ముఠాగా ఏర్పడి చేసిన పనే అని వారు భావిస్తున్నారు.

click me!