పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిని చంపి... మ్యాన్ హోల్ లో దాచిపెట్టాడో ప్రియుడు. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. శంషాబాద్ సుల్తాన్ పల్లిలో ప్రియురాలిని చంపిన ఓ ప్రియుడు.. సరూర్ నగర్ మండల ఆఫీసు సమీపంలోని మ్యాన్ హోల్ లో దాచిపెట్టాడు. సదరు ప్రియుడు అయ్యంగారి వెంకట సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్సర అనే యువతి ఈనెల 3న అదృశ్యమయ్యింది. ఆమె కనిపించడం లేదంటూ 5వ తేదీన సాయికృష్ణ స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
తాను ఆమెకు మేనమామ అవుతానని చెబుతూ 5వ తేదీన అంబేద్కర్ చౌరస్తా దగ్గర కొత్తగూడెం వెళ్లడానికి బస్సు ఎక్కించానని.. ఆ తరువాత కనిపించకుండా పోయిందని 5వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ క్రమంలో విచారణ చేపట్టగా అతను చెప్పింది అబద్దం అని తేలింది. అప్సర కుటుంబీకులు కూడా అతడికి తమతో బంధుత్వం లేదని తెలిపారు. సాయికృష్ణ తో తిరగడం మాత్రం తెలుసనడంతో పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా దారుణ విషయం వెలుగు చూసింది.
సాయికృష్ణకు అప్సరతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. సాయికృష్ణకు గతంలోనే వివాహం అయ్యింది. ఇటీవల అప్సర తనను వివాహం చేసుకోవాలని సాయికృష్ణను పట్టుబట్టడంతో అతను అపరను చంపేసి సరూర్ నగర్ లోని ఓ మ్యాన్ హోల్ లో దాచి పెట్టాడు. విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సాయికృష్ణను అరెస్ట్ చేశారు.
సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో ఉండే అప్సర (30) అదే కాలనీలోని వెంకటేశ్వర దేవాలయంలో సాయికృష్ణ (36) పూజారిగా పనిచేస్తున్నాడు. గుడికి వచ్చే క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత నాలుగేళ్లుగా వీరి మధ్య ఈ సంబంధం కొనసాగుతోంది. అప్సర ఇటీవల వివాహం చేసుకోమని పట్టుబడుతుండడంతో ఆమె తలమీద బండరాయితో కొట్టి హత్య చేశాడు.
దీనికోసం అప్సరను శంషాబాద్ సుల్తాన్ పల్లికి తీసుకెళ్లాడు. జూన్ 3వ తేదీ రాత్రి కారులో ఇక్కడికి తీసుకువచ్చిన తరువాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ... సుల్తాన్ పల్లిలో ఉన్న ఓ గోషాలలో గతంలో సాయికృష్ణ పనిచేసి ఉండడంతో అక్కడి పరిసరాలతో పరిచయం ఉంది. అక్కడినుంచి కారులో ఆమె శవాన్ని 22కి.మీ.లు సరూర్ నగర్ కు తీసుకువచ్చి.. మండలాఫీసు సమీపంలోని మ్యాన్ హోల్ లో ప్లాస్టిక్ కవర్లో చుట్టి పూడ్చి పెట్టాడు. ఆ తరువాత వాసన రాకుండా.. పైనుంచి మట్టి కప్పి పూడ్చేశాడు.
ఆ తరువాత రెండు రోజులకు స్వయంగా తానే వెళ్లి మిస్సింగ్ కంప్టైంట్ ఇచ్చాడు. దీనివల్ల తనమీద అనుమానం రాదని భావించాడు. కానీ దర్యాప్తులో ఆమె కనిపించకుండా పోయే ముందు వరకు సాయికృష్ణ, అప్సర ఇద్దరూ కలిసే ఉన్నారని... ఫోన్ లొకేషన్, సీసీ కెమెరాల ఆధారంగా తేలింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చంపిన విషయం ఒప్పుకుని.. అప్సర మృతదేహాన్ని దాచిపెట్టిన ప్రాంతాన్ని చూపించాడు. పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు.
మృతదేహం వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన తరువాతే.. వివాహేతర సంబంధమేనా.. మరేదైనా కారణం ఉందా అనేది తేలుతుందని పోలీసులు అంటున్నారు.