శ్రావణి హత్య కేసు: బొమ్మల రామారం ఎస్ఐపై వేటు

By telugu teamFirst Published Apr 27, 2019, 12:14 PM IST
Highlights

పదోతరగతి స్పెషల్‌ క్లాసులకు వెళ్లిన విద్యార్థిణి శ్రావణి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగులు ఆమె మృతదేహాన్ని ఓ పాడుబడ్డ బావిలో పాతిపెట్టారు. ఈ కేసు దర్యాప్తులో ఆలస్యంగా స్పందించిన పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

యాదాద్రి: భువనగిరి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం ఎస్‌ఐ వెంకటయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌చేస్తూ డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థిని శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఆయనపై వేటు వేశారు.
 
పదోతరగతి స్పెషల్‌ క్లాసులకు వెళ్లిన విద్యార్థిణి శ్రావణి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగులు ఆమె మృతదేహాన్ని ఓ పాడుబడ్డ బావిలో పాతిపెట్టారు. ఈ కేసు దర్యాప్తులో ఆలస్యంగా స్పందించిన పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసు వాహనాలపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకుంది. 

హాజీపూర్‌కు చెందిన పాముల నర్సింహ కూతురు శ్రావణి (15) మేడ్చల్‌ జిల్లా కీసరలోని సెరినిటీ ప్రైవేట్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి పూర్తిచేసింది. వారం రోజులుగా పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి ప్రత్యేక తరగతులకు హాజరవుతోంది. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తుంది.

గురువారం క్లాసులకు వెళ్లిన శ్రావణి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో రాత్రి వరకు తల్లిదండ్రులు వేచి చూసారు. రాత్రి కూడా రాకపోవడంతో గ్రామస్థుల సహకారంతో గాలించారు. శుక్రవారం తెల్లవారుజామున గ్రామం సమీపంలోని ఓ పాడుబడ్డ బావిలో శ్రావణి స్కూల్‌ బ్యాగు కనిపించింది. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

నర్సింహ ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రావణి ఆచూకీ, ఆధారాల కోసం డాగ్‌, క్లూస్‌ టీంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. బ్యాగు దొరికిన బావికి 100 గజాల దూరంలో ఉన్న మరో పాడుబడ్డ బావిలో మట్టి గుంతను తవ్విన ఆనవాళ్లను గ్రామస్థులు గుర్తించారు. అక్కడ తవ్వి చూశారు. అక్కడ శ్రావణి మృతదేహం కనిపించింది. 
 
ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేసినా రాత్రి వరకు మృతదేహాన్ని గుర్తించలేకపోడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్టు చేసేవరకు మృతదేహాన్ని తరలించడానికి అనుమతించబోమని భీష్మించి కూర్చున్నారు. 

డీసీపీ వాహనంపై దాడి చేశారు. దీంతో ఆ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. రాత్రి 11.30 వరకు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఆ తర్వాత పోలీసులు బాలిక కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

click me!