ఎన్టీఆర్ కు సినీ గ్లామర్, కేసీఆర్ దుస్సాహసం: అంతేనన్న కేటీఆర్

By telugu teamFirst Published Apr 27, 2019, 11:50 AM IST
Highlights

తెలుగు ప్రజల కోసం పార్టీ లు పెట్టి విజయం సాధించిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఉన్నారని, వారిలో ఒకరు ఎన్టీఆర్ కాగా మరొకరు కెసిఆర్ 
అని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ విజయం సాధించడానికి అప్పుడున్న రాజకీయ శూన్యత, ఆయనకు సినీ నటుడిగా ఉన్న గ్లామర్ కారణమని అన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ భవన్ శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు ,ఎంపీ లు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కె.టి .రామారావు జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. 

కెసిఆర్ వెంట ఇన్నేళ్లు నడిచిన, నడుస్తున్న గులాబీ సైనికులకు, సైనికురాళ్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఎంచుకున్న లక్ష్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రెండు సార్లు సీఎం అయిన ఘనత కెసిఆర్ కే సొంతమని ఆయన అన్నారు. 

తెలుగు ప్రజల కోసం పార్టీ లు పెట్టి విజయం సాధించిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఉన్నారని, వారిలో ఒకరు ఎన్టీఆర్ కాగా మరొకరు కెసిఆర్ 
అని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ విజయం సాధించడానికి అప్పుడున్న రాజకీయ శూన్యత, ఆయనకు సినీ నటుడిగా ఉన్న గ్లామర్ కారణమని అన్నారు. 

కెసిఆర్ కు బలమైన సామాజిక నేపథ్యం, ఆర్థిక వనరులు లేకున్నా విజయం సాధించారని, కెసిఆర్ పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదని ఆయన అన్నారు. కెసిఆర్ ఓ దుస్సాహసంతో టీఆర్ఎస్ ను ను స్థాపించారని చెప్పారు. అనేక ప్రతికూలతల మధ్య మొక్క వోని దైర్యం తో ముందుకు సాగారని ప్రశంసించారు. తెలంగాణ పోరాటాన్ని వదిలితె రాళ్ళ తో కొట్టి చంపండని పార్టీ ఆవిర్భావం నాడే దైర్యంగా చెప్పిన వ్యక్తి కెసిఆర్ అని ఆయన చెప్పారు.

ప్రణబ్ ముఖర్జీ లాంటి వ్యక్తి కెసిఆర్ నిబద్ధతను కీర్తించారని ఆయన గుర్తు చేశారు. ఇన్నేళ్ళలో కెసిఆర్ ఎత్తు పల్లాలు చూశారని ఆయన చెప్పారు.విజయాలు సాధించినప్పుడు పొంగి పోలేదు, అపజయాలు వచ్చినపుడు కుంగిపోలేదని అన్నారు. కెసిఆర్ వెంట మొదట్లో నడిచిన వారు వేలల్లో ఉంటే ఇపుడు లక్షల్లో ఉన్నారని చెప్పారు.

గల్లి నుంచి ఢిల్లీ దాకా ఎగురుతున్నది గులాబీ జెండానే అని అన్నారు. పదహారుకు పదహారు ఎంపీ స్థానాలను తమ పార్టీయే గెలుస్తుందని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎగిరేది గులాబీ జెండానే అని అన్నారు. అన్ని వర్గాల ప్రజల గుండెల్లో కెసిఆర్ ఉన్నారని అన్నారు. 

కెసిఆర్ లాంటి నాయకుడు తమకు ఎందుకు లేరని వేరే రాష్టాల వారు భావించే పరిస్థితి వచ్చిందని, తెలంగాణ లో టీఆర్ఎస్ కు ఉన్న నేతలు కార్యకర్తలు వేరే పార్టీకి లేరని చెప్పారు. పార్టీలో కార్యకర్తల సంఖ్య ఎక్కువైనందున అందరూ సంయమనంతో ముందుకు సాగాలని అన్నారు.

విబేధాలు నాలుగు గోడల మధ్యే ఉండాలని, రచ్చకెక్కొద్దని ఆయన సూచించారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించే చాణక్య నీతి కెసిఆర్ దగ్గర ఉందని, తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవడాన్ని ఓర్వలేని వాళ్ళు బద్నామ్ చేసేందుకు గుంట నక్కల్లా వేచి ఉన్నారని అన్నారు.

click me!