వ్యవస్ధలు విఫలమైనట్లేనా ?

First Published Nov 9, 2016, 3:31 PM IST
Highlights

నల్లధన కుబేరుల పని పట్టటానికి, నల్లధనాన్ని వెలికితీయటానికి ఉన్న వ్యవస్ధలన్నీ నిర్వీర్యమైనట్లు ప్రభుత్వమే ఇపుడు అంగీకరించినట్లైందని కూడా ప్రజల్లో అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

వ్యవస్ధలోని లోపాలను సరిదిద్దలేక ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏకంగా రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులపాల్జేసినట్లు  ప్రజలు మండిపడుతున్నారు. అది కూడా ముందుచూపు లేకుండా పెద్ద నోట్లను రద్దు చేయటంతో కోట్లాది మంది ప్రజలను నానా యాతలకు గురిచేసినట్లుగా వాపోతున్నారు. నల్లధనాన్ని నియంత్రించాలన్నా, నకిలీ నోట్లను అదుపు చేయాలన్నా చెలామణిలో ఉన్న వెయ్యి, 500 రూపాయల నోట్లను హటాత్తుగా రద్దు చేయటం ఒక్కటేనా మార్గమని యావత్  భారతదేశం నరేంద్రమోడిని ప్రశ్నిస్తున్నది.

 పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల రెండు మూడు రోజులు ఇబ్బందులు తప్పవని ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించటాన్ని ఆక్షేపిస్తున్నారు. ఈ రెండు మూడు రోజుల్లో జరిగే అనర్ధాలకు ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయా అని నిలదీస్తున్నారు.  ప్రధానంగా అనారోగ్యం విషయంలో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పటికే అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న వారి పరిస్ధితి ఏమిటి ? వారికి డబ్బులు ఎవరు చెల్లిస్తారన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పటం లేదు.

గడచిన ఎన్నికల్లో స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీని భారత్ కు తీసుకు వస్తామని ఉత్తరుని ప్రగల్బాలు పలికిన మోడి బృందం ఆ పని చేయలేకపోయింది. దాంతో ప్రజల నుండి పెద్ద ఎత్తున విమకర్శలు మొదలయ్యాయి. దాంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోడి ఏకంగా పెద్ద నోట్ల రద్దు పేరుతో కోట్లాది రూపాయల మధ్య, ఎగువ, సామాన్య తరగతుల ప్రజలను ఇబ్బందుల పాల్జేసినట్లు పలువురు మండిపడుతున్నారు.

    నల్లధనాన్ని అరికట్టేందుకు పలు వ్యవస్ధలున్నాయని అవన్నీ ఏ మేరకు సవ్యంగా పనిచేస్తున్నాయో అన్న విషయాలు ఇపుడు దేశానికి స్పష్టమైనట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నల్లధన కుబేరుల పని పట్టటానికి, నల్లధనాన్ని వెలికితీయటానికి ఉన్న వ్యవస్ధలన్నీ నిర్వీర్యమైనట్లు ప్రభుత్వమే ఇపుడు అంగీకరించినట్లైందని కూడా ప్రజల్లో అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇంత చేసినా కలుగుల్లో ఉన్న నల్లధనం వెలికి వస్తుందన్న నమ్మకం లేదని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎటుతిరిగీ నష్టపోయేది మాత్రం సామన్య ప్రజలేనని నిటూర్చుతున్నారు.

click me!