
చేతబడి పేరుతో తమ సొంత బంధువులే వేధింపులకు గురిచేయడం, దాడులు చేయడంతో తల్లడిల్లింది ఆ కుటుంబం. తీవ్ర మనస్థాపంతో తమ ముగ్గురు ఆడపిల్లలకు ముందుగా ఉరేసి తర్వాత తామూ ఉరేసుకున్నారా దంపతులు. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారే సరికే విగతజీవులుగా మారిపోయారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలం కందుగుల గంగిరెద్దుల కాలనీలో ఈ విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గంగిరెద్దుల కాలనీకి చెందిన ఘంటా కొమరయ్య(36)కు హుస్నాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన కొమరమ్మ(34)తో కొద్ది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఎల్లమ్మ(10), కొమరమ్మ(8), అంజమ్మ(6) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల కొమరయ్య మంత్రాలు, చేతబడులు చేస్తున్నాడనే నెపంతో కొమరమ్మ పుట్టింటి వారు అతడి కుటుంబాన్ని హుస్నాబాద్‌కు పిలిపించి వారిపై దాడి చేశారు. తీవ్రంగా అవమానపరిచారు.
దీనికితోడు కొందరు గ్రామస్తులు కూడా కొమరయ్య దంపతులను చేతబడి వస్తుందంటూ వేధింపులకు గురిచేశారని తెలిసింది. అనుక్షణం వారిని భయభ్రాంతులకు గురిచేసేలా సూటిపోటి మాటలతో వేధించినట్లు చెబుతున్నారు. బతికి ఉంటే ఎక్కడ తమపై దాడులు చేసి చంపుతారోనన్న భయం వారిని వెంటాడింది.
దీంతో మనస్థాపానికి గురైన కొమరయ్య దంపతులు ఆదివారం రాత్రి ముందు పిల్లలకు ఉరి వేసి అనంతరం వారు ఉరేసేకుని బలవన్మరణం పొందారు. సోమవారం ఉదయం వీరి ఆత్మహత్యలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పట్టణ సీఐ రమణమూర్తి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
చేతబడి చేస్తున్నారంటూ అవమానపరచడం, వేధింపులకు గురిచేయడంతోనే ఒక కుటుంబం మృత్యుఒడికి చేరిపోయింది. తెలంగాణ గ్రామాల్లో ఇంకా చేతబడి పేరుతో అనేక మందిని వేధిస్తున్న ఘటనలు రోజుకొకటి జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పండ్లు పీకేయడం, చెట్లకు కట్టేసి దాడులు చేయడం ఇంకా జరగడం బాధాకరమే.