
నిజామాబాద్ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగులుతుంది. అరవింద్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు.. ఆయనకు వ్యతిరేకంగా నిరనస కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రోజున ఆర్మూర్, బోధన్, బాల్కొండకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. సేవ్ బీజేపీ పేరుతో ఉన్న ఫ్లకార్డులను కూడా ప్రదర్శించారు.
ఇక, ఇటీవల 13 మండలాల బీజేపీ అధ్యక్షులను మార్చుతూ అర్వింద్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పలు నియోజవర్గాలకు చెందిన కార్యకర్తలు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఎంపీ తన అనుచరులను అధ్యక్షులుగా నియమించారని.. చాలా కాలంగా పార్టీకి విధేయులుగా ఉన్న వారిని తప్పించారని ఆరోపించారు.
అయితే తనపై వస్తున్న ఆరోపణలను ధర్మపురి అరవింద్ ఖండించారు. అది పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు. ‘‘మండల అధ్యక్షుల నియామకంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది’’ అని అరవింద్ పేర్కొన్నారు. అయితే అరవింద్ ప్రకటన చేసినప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా అసంతృప్తుల నిరసనలు ఆగడం లేదు.