వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు సీటును కూడా బీజేపీనే గెలుస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఓల్డ్ సిటీ ప్రజలు ప్రధానమంత్రిగా మూడో సారి నరేంద్ర మోడీనే బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారని చెప్పారు.
Kishan Reddy: లోక్ సభ ఎన్నికల ముంగిట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఎంఐఎం పార్లమెంటు సీటును కూడా ఈ ఎన్నికల్లో తామే గెలుస్తామని అన్నారు. కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్ పార్లమెంటు సీటు గెలిచి తీరుతుందని కిషన్ రెడ్డి విశ్వాసంగా తెలిపారు. ప్రస్తుతం ఈ స్థానానికి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నగరంలోని మైనార్టీలు కూడా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీనే బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
ఓల్డ్ సిటీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్ సిటీ స్థానాల్లో బీజేపీకి ఓటు శాతం పెరిగిందని, అదే ఎంఐఎం పార్టీకి ఓటు శాతం తగ్గిందని తెలిపారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో వారంతా బీజేపీకే ఓటు వేస్తారని అనుకుంటున్నానని చెప్పారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో మెజార్టీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదిస్తున్నారని, తెలంగాణ బీజేపీకి మంచి ఆదరణ లభిస్తున్నదని తెలిపారు.
Also Read: S Gurumurthy: శ్వేతపత్రం వర్సెస్ దిష్టి చుక్క.. కేంద్రం ఏం చెప్పింది? కాంగ్రెస్ ఏం చెప్పింది?
అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత సమాజంలోని అన్ని వర్గాలు ముఖ్యంగా మహిళలు, యువత బీజేపీని బలపరచడానికి వస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.