వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్ ఖాయం: గోవా సీఎం ప్రమోద్ సావంత్

By narsimha lodeFirst Published May 12, 2022, 1:59 PM IST
Highlights

తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తమ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ మంచి ఫలితాలు అందిస్తుందన్నారు.


హైదరాబాద్: Telangana లో కూడా BJP  ప్రభుత్వం ఏర్పాటు కానుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అభిప్రాయపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేందుకు గాను ఆయన ఇవాళ  హైద్రాబాద్ కు వచ్చారు.  గురువారం నాడు  Pramod Sawant మీడియాతో మాట్లాడారు.Goa లో మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందన్నారు.

100 శాతం కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన మొదటి రాష్ట్రంగా గోవా ఉందని ఆయన అన్నారు. 
తెలంగాణలో  మాదిరిగానే తమ రాష్ట్రంలో కూడా వితంతు పెన్షన్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.గోవాలో డబుల్ ఇంజన్ సర్కార్ మంచి ఫలితాలు అందిస్తుందన్నారు.మోడీ పథకాలు, కొన్ని తెలంగాణలో అందడం లేదని ఆయన ఆరోపించారు.తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని  ఆయన కోరుకున్నారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 14న ముగియనుంది.ఈ  యాత్ర ముగింపు సందర్భంగా  నిర్వహించనున్న సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. గత వారం మహబూబ్ నగర్ లో నిర్వహించిన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. 

2021 ఆగష్టు 28వ తేదీన బండి సంజయ్ తన తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను హైద్రాబాద్ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రారంభించారు.  తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన హుస్నాబాద్ లో ముగించారు.   పాదయాత్ర ముగించిన తర్వాత బండి సంజయ్ హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్  14న జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ ఆలయం నుండి బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు. ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.  రెండో విడత పాదయాత్ర పూర్తైన తర్వాత కొన్ని రోజుల విరామం తర్వాత మరో విడత యాత్రను  బండి సంజయ్ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నారు బండి సంజయ్.  

2023 లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ పాదయాత్ర పినికి వస్తుందని కూడా పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు కమలదళం నేతలు.

ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల నుండి వచ్చిన సమస్యలపై బీజేపీ నేతలు ఆందోళన కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసే అవకాశం లేకపోలేదు. ప్రజలు ఏఏ సమస్యలపై ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారనే విషయాలపై కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఆరా తీస్తోంది. ఏ సమస్యలపై పోరాటం చేస్తే కేసీఆర్ ను మరింత ఇరుకున పెట్టే అవకాశం ఉంటుందనే దానిపై  బీజేపీ నేతలు వ్యూహారచన చేయనున్నారు.

click me!