యాదగిరిగుట్టలో విషాదం... లీవ్ ఇవ్వడంలేదని బస్సుకింద పడి ఆర్టిసి డ్రైవర్ ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : May 12, 2022, 01:40 PM IST
యాదగిరిగుట్టలో విషాదం... లీవ్ ఇవ్వడంలేదని బస్సుకింద పడి ఆర్టిసి డ్రైవర్ ఆత్మహత్య

సారాంశం

ఇంతకలం సేవలందించిన ఆర్టీసి డిపోలోనే బస్సు కింద పడి ఓ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన విషాదం యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది.

యాదగిరిగుట్ట: మరికొద్ది రోజుల్లో రిటైరవ్వాల్సి వుండగా ఇంతకాలం సేవలందించి బస్ డిపోలోనే ఆత్మహత్య చేసుకున్నాడో ఆర్టిసి డ్రైవర్. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్టిసి అధికారుల వేధింపుల వల్లే డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో మిర్యాల కిషన్ (60) ఆర్టిసి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఎన్నో ఏళ్ళుగా ఆర్టిసీ బస్సు నడుపుతూ సేవలందిస్తూ వచ్చిన ఆయన ఈ నెలాకరులో రిటైర్ అవ్వాల్సి వుంది. ఇలాంటి సమయంలో డ్రైవర్ కిషన్ దారుణానికి ఒడిగట్టాడు.  

తాను పనిచేసే ఆర్టిసి డిపోలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిపోలోని బంక్ లో డీజిల్  నింపుకుని వెళుతుండగా ఒక్కసారిగా బస్సుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హఠాత్తుగా కిషన్ కింద పడటంతో బస్సును ఆపడం డ్రైవర్ కు సాధ్యపడలేదు. దీంతో బస్సు కిషన్ పైనుండి వెళ్లడంతో  అతడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఇలా ఇంతకాలం పనిచేసిన బస్ డిపోలోనే  తోటి సిబ్బంది కళ్లముందే కిషన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

అయితే ఆర్టిసి ఉన్నతాధికారుల వేధింపులే కిషన్ ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు.  అనారోగ్య కారణాలతో సిక్ లీవ్ పెట్టినా అధికారులు మంజూరు చేయలేదని... దీంతో తీవ్ర డిప్రెషన్ తోనే విధులకు హాజరైన అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. కిషన్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని... ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

డ్రైవర్ కిషన్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు యాదగిరిగుట్ట బస్ డిపోకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?