
హైదరాబాద్: జాతీయస్థాయి నాయకుల మీటింగ్ లు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) పాదయాత్రతో మంచి ఊపుమీదున్న తెలంగాణ బిజెపి (bjp)కి షాక్ తగిలింది. ఇతరపార్టీల నుండి భారీగా చేరికలను ఆహ్వానిస్తూ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అదిష్టానం, రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. కానీ ఈ చేరికలు బిజెపికి మరో తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఇతర పార్టీల నాయకుల చేరికతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ బిజెపి నాయకులు ఇతరపార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి పరిణామమే యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
ఇటీవల టీఆర్‌ఎస్ నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ (budidha bikshamayya goud) బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆలేరు నుండి బిజెపి టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి (bandru shobharani) తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఇక తనకు బిజెపి టికెట్ రాదని నిర్దారించుకున్న ఆమె తన భవిష్యత్ తాను చూసుకున్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
అమెరికాలోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శోభారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ సమక్షంలో శోభారాణి కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. అమెరికాకు వచ్చేముందే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తన రాజీనామా లేఖ పంపినట్లు శోభారాణి తెలిపారు. ఇకపై కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
శోభారాణి చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చే రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకే శోభారాణి పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆమె సేవలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందని... పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
బండ్రు శోభారాణి గతంలో టీఆర్ఎస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల్లో ముఖ్య నాయకురాలిగా పనిచేసారు. టీఆర్ఎస్ లో సరైన గుర్తింపు లేకపోవడం, ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమవడం, టిడిపి తెలంగాణలో బలహీనపడటంతో శోభారాణి రెండేళ్ల క్రితం బిజెపిలో చేరారు. అయితే అక్కడ యాక్టివ్ గా పనిచేసి బిజెపి బలోపేతానికి కృషిచేసారు. కానీ ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ చేరికతో ఆమె బిజెపిని కూడా వీడాల్సి వచ్చింది.
ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా ఆలేరు నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అనుచరుడు బీర్ల ఐలయ్య పార్టీ ఇంచార్జ్ గా వున్నాడు. అతడికి చెక్ పెట్టేందుకే శోభారాణిని రేవంత్ పార్టీలో చేర్చుకున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.
ఇకపోతే ఇటు టీఆర్ఎస్ విప్ సునీతా మహేందర్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు గెలిచి నియోజకవర్గాన్ని కంచుకోటలా మార్చుకున్నారు. బిజెపి కూడా మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ను చేర్చుకుని ఆలేరుపై గట్టిగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే శోభారాణి చేరిక ద్వారా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని రేవంత్ భావించినట్లున్నారు. అందుకోసమే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.