
కరీంనగర్:టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీజేపీకే ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.సోమవారం నాడు బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులకు రక్షణ కల్పించే పార్టీ బీజేపీయేనని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యమకారులందరికీ బీజేపీ వేదిక కానుందన్నారు.
also read:టార్గెట్ హుజూరాబాద్... రాష్ట్ర బిజెపి చీఫ్ సంజయ్ స్పెషల్ ఫోకస్
తెలంగాణలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని ఆయన చెప్పారు. తెలంగాణ తల్లిని గుడిలో నిర్భంధించడానికేనా తెలంగాణ సాధించుకొన్నామా అని ఆయన ప్రశ్నించారు. తనకు అనుకూలంగా ఉన్నవారినే సీఎం కేసీఆర్ తన వద్ద ఉంచుకొన్నారన్నారు. తన వద్ద ఉన్నవాళ్లు అవినీతిపరులా, కబ్జాదారులా అని కేసీఆర్ చూడడం లేదని సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి చిట్టాను వెలికితీస్తున్నామన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరే విషయమై స్థానిక నేతలతో సంజయ్ చర్చించారు.