ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ బండి సంజయ్ కేసీఆర్ కు లేఖ రాశారు.
హైదరాబాద్: తక్షణమే పీఆర్‌సీని ఏర్పాటు చేసి జులై 1 నుండి ఉద్యోగులకు పెంచిన జీతాలు చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఆదివారం నాడు బండి సంజయ్ కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
ఈనెల 9న కేబినెట్ సమావేశంలో పీఆర్సీ ఏర్పాటుపై చర్చించాలని ఆ లేఖలో ఆయన కోరారు. పీఆర్సీ పై మూడు మాసాల్లో నివేదిక తెప్పించుకోవాలన్నారు. జూలై 1 నుండి కొత్త పీఆర్సీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సహా ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని బండి సంజయ్ చెప్పారు. ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కావడం లేదన్నారు.
రుణమాఫీ, ఫ్రీ యూరియా, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, దళిత బంధు, దళితులకు మూడెకరాలు, గిరిజన బంధు, గిరిజన రిజర్వేషన్లు, చేనేత బంధు, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, సొంత జాగా ఉన్నవారికి రూ. 3 లక్షల ఆర్దిక సాయం వంటి హామీలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని కేసీఆర్ ను ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ సర్కార్ పై ఆయన విమర్శలు గుప్పించారు.
also read:మహిళలపై అత్యాచారాలకు నిరసనగా దీక్షకు సిద్దమైన బండి సంజయ్.. వివరాలు ఇవే..
ఈ నెల 9న జరిగే కేబినెట్ సమావేశంలో ప్రజల సమస్యలపై చర్చించాలని ఆయన కేసీఆర్ ను కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలిపారు.