ఆ భయంతోనే ఫ్రంట్ ల ఏర్పాటుకు కేసీఆర్ యత్నం: బండి సంజయ్

By narsimha lodeFirst Published Jan 11, 2022, 5:03 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై విచారణలు జరుగుతాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
 

మహబూబ్‌నగర్: తెలంగాణ సీఎం kcr, ఆయన కుటుంబం అవినీతిపై  విచారణలు జరుగుతాయని bjp తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay చెప్పారు. ఈ భయంతోనే kcr  కూటములు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

317 జీవోను నిరసిస్తూ బీజేపీ Mahabubnagar లో నిర్వహించిన  సభలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన అవినీతిపై విచారణలు జరుగుతాయనే భయంతో బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్‌ల కోసం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని బండి సంజయ్ చెప్పారు. గడీల పాలన నుండి తెలంగాణను విముక్తి చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఈ విషయమై పోరాటంలో వెనక్కి తగ్గొద్దని ప్రధాని Narendra Modi చెప్పారన్నారు.. తనకు ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారని బండి సంజయ్ గుర్తు చేసుకొన్నారు.కరోనా కంటే కేసీఆర్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని బండి సంజయ్ విమర్శించారు.

317 జీవోను రద్దు చేయాలని  ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ విషయమై  సీఎం జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఉపాధ్యాయ, ఉద్యోగులకు నష్టం చేసే ఈ జీవోను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్ తో ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు బీజేపీ మద్దతును ప్రకటించింది. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగి అరెస్టయ్యాడు.  అయితే కరీంనగర్ పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 5న స్టే ఇచ్చింది. బండి సంజయ్ ను జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించింది.

బండి సంజయ్ ను అరెస్ట్ చేయడంపై కూడా తెలంగాణ బీజేపీ నేతలు తప్పు బడుతున్నారు. బండి సంజయ్ పై నమోదు చేసిన  సెక్షన్ల పై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహరశైలిపై కూడా బీజేపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా విమర్శలు చేశారు.  బండి సంజయ్  అరెస్ట్ ను నిరసిస్తూ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. 

2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది.  ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలకు బీజేపీ గాలం వేయనుంది. మరో వైపు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నవారిపై కూడా బీజేపీ ఫోకస్ చేయనుంది.  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు గాను కమలదళం ప్రయత్నాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో కేసీఆర్ గత వారం బేటీ అయ్యారు.  ఇవాళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో భేటీ అయ్యారు కసీఆర్. గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో కూడా గులాబీ బాస్ సమావేశమయ్యారు. 
 


 


 

click me!