
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోనుందని ఆయన చెప్పారు.
ఆదివారం నాడు హైద్రాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు క్యూ లైన్లో ఉన్నవారి కోసం ఏర్పాట్లు చేయాలని ఆయన ఈసీని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద లైట్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ప్రజల్లో వ్యతిరేకత ఉందనే కారణంగా డబ్బులను పంచి ఓట్లను కొనుగోలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.హోంమంత్రిగా ఉన్న వ్యక్తి తాను ఎవరికి ఓటు వేశానో చెప్పాడని... ఇలాంటి మంత్రులు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మంత్రులకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చుకోవాలని ఆయన కేసీఆర్ కు హితవు పలికారు.తాము డబ్బులు, మందు పంచుతామని టీఆర్ఎస్ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చారని... ఏఏ ప్రాంతాల్లో తాము ఈ వ్యవహారం చేస్తామో అక్కడికి రావొద్దని పోలీసులకు చెప్పారన్నారు.
కొందరు పోలీసు అధికారులే టీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. మిమ్మల్ని సీఎం కూడా కాపాడలేడన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారనే కారణంగా ఐఎఎస్ అధికారులను హైకోర్టు శిక్షించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సీఐ స్థాయి అధికారులు మాత్రం తమతో సామరస్యపూర్వకంగానే ఉంటున్నారన్నారు. కానీ కొందరు ఆ పై స్థాయి అధికారులు బీజేపీ కార్యకర్తలపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయాలని ఆదేశాలిస్తున్నారన్నారు.రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన సర్వేల్లో కూడ ఇదే విషయం చెప్పాయన్నారు.