హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమేష్ కుమార్ ను ఏపీకి బదిలీ చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎస్ పదవికి సోమేష్ కుమార్ రాజీనామా చేయాలని ఆయన కోరారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ కేడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేస్తూ సోమేష్ కుమార్ కు ఏపీ కేడర్ ను కేటాయించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ హైద్రాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేశారు.
కోర్టు తీర్పును శిరసావహిస్తూ సోమేశ్ కుమార్ ను సీఎస్ బాధ్యతల నుండి తప్పిస్తూ ఏపీకి ఆయనను బదిలీ చేయాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. 2014 రాష్ట్ర విభజన తరువాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికమని బండి సంజయ్ చెప్పారు.
కేసీఆర్ ఏనాడూ చట్టాలను, రాజ్యాంగాన్ని, కేంద్ర నిబంధనలను గౌరవించలేదన్నారు. తన రాజకీయ అవసరాల కోసం తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అధికారులను పావుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాదని ఆయన విమర్శించారు.
తెలంగాణకు కేటాయించిన ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన సోమేశ్ కుమార్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ లబ్ది పొందారని బండి సంజయ్ విమర్శించారు. 317 జీవోసహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారని బండి సంజయ్ మండిపడ్డారు. హెచ్ఎండీఏ, రెవిన్యూ, ఇరిగేషన్, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేశ్ కుమార్ ను కేసీఆర్ పావుగా వాడుకున్నారని బండి సంజయ్ చెప్పారు.
also read:సోమేషే కాదు.. మరో పది మంది ఏపీ వాళ్లకి కేసీఆర్ అందలం : కాంగ్రెస్ నేత మహేశ్ గౌడ్
సోమేశ్ కుమార్ నియామకం విషయంలో కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా చీఫ్ సెక్రటరీగా నియమించడం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. . ఈ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒక న్యాయం? సోమేశ్ కుమార్ కు ఒక న్యాయమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సోమేశ్ కుమార్ తొలగించి తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణ కేటాయించి వ్యక్తిని సీఎస్ గా నియమించాలని ఆయన కోరారు. డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి కేటాయించిన అధికారులను ఆ రాష్ట్రానికి బదలాయించాలని కోరారు.తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.