బిజెపి టార్గెట్ తెలంగాణ: సినీ నిర్మాత దిల్ రాజుకు గాలం

By Nagaraju penumalaFirst Published Oct 22, 2019, 4:30 PM IST
Highlights

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని మంచి కసితో ఉన్న బీజేపీ దిల్ రాజును పార్టీలోకి ఆహ్వానిస్తే లాభం చేకూరుతుందని వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా సినీ రంగానికి చెందిన దిల్ రాజును పార్టీలోకి ఆహ్వానించాలనే యోచనలో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

హైదరాబాద్: దేశవ్యాప్తంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. ఇటీవల జరిగి మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇలా దేశవ్యాప్తంగా కాషాయి జెండాను రెపరెపలాడించిన మోదీ అమిత్ షా ద్వయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై దృష్టిసారించారు. 

ముఖ్యంగా తెలంగాణపై పట్టుసాధించేందుకు అమిత్ షా, మోదీ ప్రత్యేక ఆసక్తికనబరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లాపడ్డప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో బీజేపీ వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కసరత్తు చేస్తోంది. 

అందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ప్రముఖలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు సినీ నిర్మాత దిల్ రాజుకు గేలం వేస్తోందని ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని మంచి కసితో ఉన్న బీజేపీ దిల్ రాజును పార్టీలోకి ఆహ్వానిస్తే లాభం చేకూరుతుందని వ్యూహరచన చేస్తోంది. 

అందులో భాగంగా సినీ రంగానికి చెందిన దిల్ రాజును పార్టీలోకి ఆహ్వానించాలనే యోచనలో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందులో భాగంగానే మోదీ ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారని టాక్. 

దిల్ రాజుకు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వంతోపాటు ఏపీ ప్రభుత్వ పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. టీటీడీ పాలకమండలి సభ్యుడు అవుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ అది ఎందుచేతో ఆగిపోయింది.

ఇక దిల్ రాజు విషయానికి వస్తే తెలుగు సినీపరిశ్రమలో ఆయన రూటే సెపరేటు. చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ పెద్ద సినిమాలను సైతం నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత దిల్ రాజు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ టాలీవుడ్ లో అందరి నిర్మాతగా మారిపోయారు దిల్ రాజు. 

తన మెుదటి సినిమా దిల్ తోనే మంచి విజయాన్ని అందుకుని ఆ సినిమాయే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నారు. అంతేకాదు చిన్న సినిమాల నిర్వాహకులకు దిల్ ఉన్న రాజుగా కూడా పేర్గాంచారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో 30 సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు దిల్ రాజు. 

యువ హీరోలు సూపర్ స్టార్ మహేశ్ దగ్గర నుంచి మెుదలుకొని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, నాగచైతన్య ఇలా అందిరి హీరోల సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తాను పట్టిందల్లా బంగారం అన్న చందంగా అత్యధిక సినిమాలు హిట్ సాధించడం దిల్ రాజుకు కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవాలి. 

దిల్ రాజుకు టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు రాజకీయ ప్రముఖులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో తెలంగాణ ప్రజలు దిల్ రాజును బాగా ఆదరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

చిన్న సినిమాలతో పెద్ద హిట్ లను కొట్టిన దిల్ రాజు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ఇచ్చిన విందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం దిల్ రాజుకు మాత్రమే ఆహ్వానం పంపడంపై రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది. 

దక్షిణాది రాష్ట్రాల్లో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ లు, స్టార్ ప్రొడ్యూసర్ లు ఉన్నప్పటికీ వారందర్నీ కాదని మోదీ కేవలం దిల్ రాజుకు మాత్రమే ఇన్విటేషన్ పంపడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.  

మోదీ ప్రభుత్వం మ‌హాత్మా గాంధీ 150వ జ‌యంతి వేడుక‌లను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హి స్తోంది. ఛేంజ్ విత్ ఇన్ కార్యక్రమంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ‌ల‌కు ఆయ‌న ఇటీవ‌ల విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు దేశం న‌లుమూల‌ల నుంచి అనేక రంగాల్లో నిష్టాతులైన ప్ర‌ముఖుల‌ను, సినీ వ‌ర్గాల‌ను కూడాఆహ్వానించారు. 

అయితే ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం దిల్ రాజును మాత్రమే ఆహ్వానించారు. మోదీ ఆహ్వానం పంపిన అంశాన్ని స్వయంగా దిల్ రాజే స్పష్టం చేశారు. మిమ్మల్ని కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నానంటూ ఆయన మోదీని ఉద్దేశించి కామెంట్ చేశారు కూడా. 

తాజాగా ప్రధాని నరేంద్రమోదీకి నిర్మాత దిల్ రాజు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖులు ఉన్నప్పటికీ వారితో ప్రధాని నరేంద్రమోదీకి పరిచయాలు ఉన్నప్పటికీ కేవలం దిల్ రాజును మాత్రమే ఎందుకు ఆహ్వానించారబ్బా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతుంది.  

దిల్ రాజుకు బీజేపీ అంత ప్రాధాన్యత ఇవ్వ‌డం, అనేక మంది మేధావులు, సినీ దిగ్గ‌జాలు ఉండి కూడా రాజుకు మాత్ర‌మే కేంద్రంలోని బీజేపీ నేత‌లు ఆహ్వానం పంప‌డంపై అటు దక్షిణాది రాష్ట్రాల్లోనే సీరియస్ అంశంగా చర్చిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న దిల్ రాజును ఆహ్వానించడం వెనుక పొలిటికల్ లెక్కలు ఉన్నాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీ మేధావుల‌ను, సినీ, క‌ళారంగ దిగ్గ‌జాల‌ను ద‌రి చేర్చుకుంటోంది.

మేధావులను, సినీదిగ్గజాలను దగ్గరకు చేర్చుకోవడం వల్ల పార్టీకి ప్ర‌యోజ‌నకరంగా ఉంటుంద‌ని బీజేపీ భావిస్తోంది. మోదీ స్వరాష్ట్రమైన గుజ‌రాత్ లో కూడా ఇదే ఫార్ములాను అప్లై చేయడంతో అక్కడ వర్క్ అవుట్ అయ్యింది.  

ఈ కోణంలోనే దిల్ రాజును బీజేపీ దగ్గరకు చేర్చుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవ‌ల కేంద్ర మంత్రి హర్షవర్థన్ దిల్ రాజుతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలే దిల్ రాజును బీజేపీ దగ్గరకు చేర్చుకుంటుందని తెలుస్తోంది. 

ఇకపోతే దిల్ రాజుకు సైతం రాజకీయ తోడు అవసరం తప్పనిసరి. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఏ సినిమా రిలీజ్ అయినా ఐటీ దాడులు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఈ ఐటీ దాడుల నేపథ్యంలో ఒకానొక దశలో ఆవేదన కూడా వ్యక్తం చేశారు దిల్ రాజు. 

ఐటీ దాడులతోపాటు సినిమా షూటింగ్ లకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు బీజేపీ కార్డు ఉంటే ఉపయోగపడుతుందనే భావనలో  కూడా దిల్ రాజు ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

మోడీపై ఉపాసన, ఖుష్బూ భగ్గు: దిల్ రాజు ఒక్కరే, ఎవరి ప్రతినిధి?

ఉపాసనతో గొంతుకలిపిన నటి.. మోడీపై విరుచుకుపడ్డ ఖుష్బూ

మోడీపై రాంచరణ్ భార్య ఉపాసన సంచలన వ్యాఖ్యలు.. మీకు మేం కనిపించలేదా!..

click me!