బుల్లెట్ పై వ‌చ్చి గోషామహల్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాజాసింగ్..

Raja Singh: హైద‌రాబాద్ న‌గ‌రంలోని గోషామహల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాజా సింగ్‌ రెండుసార్లు గెలిచారు. ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు వివాదాస్పద ఈ బీజేపీ ఎమ్మెల్యేను గత ఏడాది ఆగస్టులో పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆయనపై 75కు పైగా కేసులు నమోదయ్యాయి. 
 

Google News Follow Us

Telangana Assembly Elections 2023: గోషామహల్ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ శనివారం మున్సిపల్ కార్యాలయంలోని అబిడ్స్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా వచ్చిన ఆయనను అబిడ్స్‌లో పోలీసులు అడ్డుకుని ఆయనతో పాటు నలుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అనుమతించారు.

ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా, మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివ‌దాస్ప‌ద‌ రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు ఈ బీజేపీ ఎమ్మెల్యేను గత ఏడాది ఆగస్టులో పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే, ఆయనకు స్థానం కల్పించేందుకు అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు కొన్ని గంటల ముందు బీజేపీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేసింది . గోషామహల్‌ నుంచి రాజా సింగ్‌ రెండుసార్లు గెలిచారు. రానున్న ఎన్నిక‌ల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు.

ఇదిలావుండ‌గా, బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌పై మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు 65 కేసులు నమోదయ్యాయి. 2010 నుంచి దేశవ్యాప్తంగా తనపై 75 కేసులు నమోదయ్యాయనీ, తన నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చాలా కేసులు IPC సెక్షన్లు 153(A) (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలు చేయడం), 295(A), 505 కింద నమోదయ్యాయి. తెలంగాణతో పాటు, కోల్‌కతా, కర్ణాటకలోని యాద్గిర్, షోలాపూర్, ముంబ‌యి, లాతూర్, మహారాష్ట్రలోని థానే, రాజస్థాన్‌లోని భిల్వారాలో కేసులు నమోదయ్యాయి.

మరో రెండు కేసుల్లో శిక్ష పడింది. శిక్షపై ఆయన వేసిన అప్పీలు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అఫిడవిట్‌లో ఆయ‌న‌ ₹ 4.07 కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించారు. వాటిలో ₹ 2.79 కోట్లు తన పేరు మీద, ₹ 1.27 కోట్లు అతని భార్య ఉషా బాయి పేరు మీద ఉన్నాయి. ఈ జంటకు ₹2.50 కోట్ల విలువైన చరాస్తులు, ₹1.57 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

Read more Articles on