మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ వాస్తవాలను పరిగణలోకి తీసుకోలేదు.. సంబంధం లేని అంశాలున్నాయి: కేంద్రానికి తెలంగాణ లేఖ

By Mahesh Rajamoni  |  First Published Nov 5, 2023, 1:23 AM IST

Medigadda Barrage: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగ‌డ్డ బ్యారేజీ (ల‌క్ష్మీ బ్యారేజీ)ని పరిశీలించిన ఎన్‌డీఎస్ఏ కమిటీ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వంటి అంశాల కలయికతో బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయ‌ని పేర్కొంది. ఈ అంశాలను ఎత్తిచూపుతూ ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణల‌ను ప్ర‌భుత్వం ఖండించింది.
 


Medigadda-Telangana writes to Centre: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘ‌ట‌న‌పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ )కు చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ చేసిన నివేదికల్లో చాలా నిరాధారమైనవనీ, వాస్తవాలను పూర్తిగా అర్థం చేసుకోకుండానే చేశారని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ స‌ర్కారు కేంద్రానికి లేఖ రాసింది. ఎన్‌డీఎస్‌ఏ నివేదికను ఖండిస్తూ రజత్ కుమార్ ఎన్‌డీఎస్‌ఏ  చైర్మన్ సంజయ్ కుమార్ సిబల్ కు రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వానికి పంపిన నివేదికను కాళేశ్వరం ప్రాజెక్టుపై నిందగా  అభివర్ణించారు. రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) సమర్పించిన వివరాలను పరిశీలించకుండా, ఎలాంటి పరిశోధనాత్మక పని లేకుండా ఈ నివేదికను రూపొందించారనీ, దీనికి రాష్ట్రం అంగీకరించలేదని ఆయన అన్నారు.

కమిటీ కోరిన 20 డాక్యుమెంట్లలో 11 మాత్రమే తమకు అందాయని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్‌డీఎస్‌ఏ కోరిన అన్ని పత్రాలను తనిఖీ, తదుపరి ఇంటరాక్టివ్ సమావేశాల సమయంలో కమిటీకి చూపించారని ఆయన గుర్తు చేశారు. అక్టోబర్ 29న 20 డాక్యుమెంట్లు సమర్పించాలని కోరుతూ ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి అక్టోబర్ 27న లేఖ అందింది. నివేదికలను తయారు చేయడానికి త‌మ‌కు స‌మ‌యం ఇవ్వనప్పటికీ, అక్టోబర్ 29న 17 డాక్యుమెంట్లను ఈమెయిల్ ద్వారా కమిటీకి పంపామ‌ని చెప్పారు. మిగిలిన మూడు డాక్యుమెంట్లను నవంబర్ 1న పంపామనీ, డాక్యుమెంట్ల కాపీలను జత చేశామని, వాటిని నివేదికలో విస్మరించారని తెలిపారు.

Latest Videos

undefined

లక్ష్మీ బ్యారేజీ స‌మ‌స్య‌ల‌కు గల కారణాలపై కమిటీ ఎలాంటి పరిశోధనాత్మక చర్యలు తీసుకోకుండా నిర్ధారణకు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రస్తుతం నీట మునిగిన పునాది, ఇతర సంబంధిత నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సరైన కారణాలు తెలుస్తాయనీ, నీటిని మళ్లించడానికి, బ్యారేజీ ప్రభావిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు వీలుగా ఏజెన్సీలో కాఫర్ డ్యాం నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ పరిశోధన పూర్తయితేనే బ్యారేజీలో పిల్లర్లు మునిగిపోవడానికి సరైన కారణాలను అంచనా వేయగలం. ఈ సమయంలో, మేము మీ నిర్ధారణలతో ఏకీభవించలేకపోతున్నామని రజత్ కుమార్ అన్నారు. నాణ్యతా నియంత్రణ సరిగా లేకపోవడంపై ఎన్‌డీఎస్‌ఏ వ్యాఖ్యలను కూడా తిప్పికొట్టారు.

బ్యారేజీల నిర్మాణంలో ఉపయోగించే సిమెంట్, కాంక్రీట్, స్టీల్ వంటి వివిధ అంశాలపై మార్గదర్శకాలతో పాటు బ్యారేజీల రూపకల్పనకు సంబంధించిన వివిధ అంశాలకు ఉద్దేశించిన 3 కోడ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రచురించిందన్నారు. మరింత లోతైన అవగాహన కోసం కేంద్ర ఇరిగేషన్ అండ్ పవర్ బోర్డు కూడా బ్యారేజీలపై రెండు సంపుటాలుగా మాన్యువల్స్ ను ప్రచురించింది. దేశంలోనే అగ్రగామి సంస్థగా పేరొందిన తెలంగాణ రాష్ట్ర సీడీవో అన్ని ప్రాజెక్టులకు, ముఖ్యంగా కాళేశ్వరం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు పైన పేర్కొన్న మార్గదర్శకాలను చిత్తశుద్ధితో పాటించింద‌ని తెలిపారు. హైడ్రాలజీ, కాస్టింగ్, ప్లానింగ్, పర్యావరణ అనుమతులు వంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు జలశ‌క్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా కమిటీ 2018 జూన్ 6న ఆమోదం తెలిపిందన్నారు.

click me!