కేంద్రంలో, రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మోదీ 3.0 పాలన ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ లోకి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ, తెలంగాణ అధ్యక్షుల బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది...
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకొని.. కూటమిలో తొలి అతిపెద్దగా పార్టీ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పీఠం అధిరోహిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోదీతో పాటు 60 మందికి పైగా ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పటివరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మోదీ మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోనున్నారు. మరి కొత్త అధ్యక్షుడిగా ఎవరికి పగ్గాలు అప్పగిస్తారన్నది వేచిచూడాలి.
ఇక తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 8 స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి (సికింద్రాబాద్)తో పాటు బండి సంజయ్ (కరీంనగర్), రఘునందన్ రావు (మెదక్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), ధర్మపురి అరవింద్ (నిజామాబాద్), గోడం నగేశ్(ఆదిలాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్) ఎంపీలుగా విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి మోదీ కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. బండి సంజయ్‌ని సైతం కేంద్ర కేబినెట్‌లోకి ఆహ్వానించిన నేపథ్యంలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అందించబోతున్నట్లు చర్చ జరుగుతోంది.
undefined
ఈటల రాజేందర్ తెలంగాణలో మంచి పట్టున్న నేత. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేశారు. 3 లక్షల 91వేల పైచిలుకు భారీ మెజారిటీతో లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే, తొలుత ఈటలకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందని తొలుత అంతా భావించారు. అనూహ్యంగా మారిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర క్యాబినేట్‌కు ఎంపికయ్యారు. ఈటలతో పాటు డీకే అరుణ, ధర్మపురి అరవింద్‌కు కూడా కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందన్న వార్తలు వినిపించినా అలా జరగలేదు. కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టబోతున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.