ధరణి పోర్టల్ : ఎత్తేస్తామని జేపీ నడ్డా.. కొనసాగిస్తామని బండి సంజయ్ , బీజేపీ కేడర్‌లో అయోమయం

Siva Kodati |  
Published : Jun 25, 2023, 09:46 PM IST
ధరణి పోర్టల్ : ఎత్తేస్తామని జేపీ నడ్డా.. కొనసాగిస్తామని బండి సంజయ్ , బీజేపీ కేడర్‌లో అయోమయం

సారాంశం

ధరణి పోర్టల్‌పై బీజేపీ నేతలు జేపీ నడ్డా, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని పార్టీ కేడర్‌లో అయోమయానికి కారణమవుతున్నాయి. ధరణి పోర్టల్ ఎత్తేస్తామని జేపీ నడ్డా, ఉంచుతామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆదివారం నాగర్ కర్నూలులో జరిగిన నవ సంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షసుల సమితి అని సెటైర్లు వేశారు. తెలంగాణలో ధరణితో భారీ అవినీతికి పాల్పడుతున్నారని  జేపీ నడ్డా ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నడ్డా పేర్కొన్నారు. 

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు దు:ఖంతో వున్నారని నడ్డా అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె మాత్రమే సంతోషంగా వున్నారని దుయ్యబట్టారు. మోడీ పాలనలో దేశం పురోగమిస్తోందని.. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని జేపీ నడ్డా పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు రేషన్ అందిస్తోందన్నారు. ఆయన  ప్రభుత్వం పేదలకు అంకితమని.. మోడీ అధికారంలోకి వచ్చాక పేదరికం పది శాతానికి పడిపోయిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. 

ALso Read: ధరణిని రద్దు చేయం, కేసీఆర్ పథకాలు వుంటాయి : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మోడీ 4 కోట్ల మందికి ఇళ్లు నిర్మించారని ఆయన తెలిపారు. కమల వికాసంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని జేపీ నడ్డా పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.6 వేలు అందిస్తున్నామని.. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ఏర్పడిందని ఆయన వెల్లడించారు. ఐటీ, ఆటోమొబైల్ సహా అన్ని రంగాల్లోనూ భారత్ దూసుకెళ్తోందన్నారు. మోడీ చేపట్టిన సంస్కరణలతో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని జేపీ నడ్డా ప్రశంసించారు. మోడీని గ్లోబల్ లీడర్‌గా ప్రపంచమంతా కొనియాడుతోందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో పదో స్థానంలో వున్న భారత్‌ను మోడీ ఐదో స్థానంలోకి తెచ్చారని నడ్డా కొనియాడారు. 

అయితే కొద్దిరోజుల క్రితం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధరణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి కేసీఆర్ కుటుంబానికి అనుకూలంగా వుందని.. దానిని ప్రజలకు తగిన విధంగా మారుస్తామని బండి సంజయ్ తెలిపారు. ధరణిలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను సైతం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు నడ్డా చేసిన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా వున్నాయి. దీంతో బీజేపీ కేడర్ అయోమయానికి గురవుతోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?