తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తామనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏపీలో మాత్రం జనసేనతో కలిసి పోటీ చేస్తామన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. తెలంగాణలో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన ప్రకటించారు. గురువారం నాడు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. టీడీనీతో కలిసి పోటీ చేసే ఆలోచన లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తామని డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. ఏపీలో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లారు.ఈ సమయంలో ప్రధాని మోడీతో టీడీపీ చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత బీజేపీకి టీడీపీ దగ్గర అవుతుందనే ప్రచారం కూడ లేకపోలేదు. ఎన్డీఏలోకి తిరిగి టీడీపీ వచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ విషయ,మై ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు. టీడీపీతో కలిసి పోటీ చేయబోమని చెప్పారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా బీజేపీతో టీడీపీ కలిసి పోటీ చేసింది. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ గా కూడ కొనసాగారు. 1999 నుండి 2004 అసెంబ్లీ ఎన్నికల వకు బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కొనసాగింది. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య అంతరం పెరిగింది. 2014 ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ మళ్లీ దగ్గరైంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ, ఏపీల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఏపీలో టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం పంచుకుంది. తెలంగాణలో టీడీపీ 15 , బీజేపీ ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చింది. మళ్లీ ఎన్డీఏలోకి టీడీపీ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం సాగుతుంది. ఈ దిశగానే చంద్రబాబు అడుగులున్నాయనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు టీడీపీ వర్గాలకు షాక్ ను కల్గించింది.