వైజాగ్ స్టీల్ సంగతి తర్వాత.. తెలంగాణలో మూతపడ్డ వాటి పరిస్థితేంటీ : కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు

Siva Kodati |  
Published : Apr 11, 2023, 08:20 PM IST
వైజాగ్ స్టీల్ సంగతి తర్వాత..  తెలంగాణలో మూతపడ్డ వాటి పరిస్థితేంటీ : కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనేందుకు నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలోని నిజాం షుగర్స్, హెచ్ఎంటీ, ఆల్విన్, అజాంజాహి మిల్స్, రేయన్స్, ప్రాగా టూల్స్ , డీబీఆర్ మిల్స్ పరిస్ధితి ఏంటని లక్ష్మణ్ ప్రశ్నించారు

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనేందుకు నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేటీఆర్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలన్నారు. తెలంగాణలో మూతబడిన ఫ్యాక్టరీలను తెరిపించమంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం 31 ఖనిజాలపై హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చిందని ఆయన తెలిపారు.

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని లక్ష్మణ్ నిలదీశారు. నిజాం షుగర్స్, హెచ్ఎంటీ, ఆల్విన్, అజాంజాహి మిల్స్, రేయన్స్, ప్రాగా టూల్స్ , డీబీఆర్ మిల్స్ పరిస్ధితి ఏంటని లక్ష్మణ్ ప్రశ్నించారు. హెఎంటీ భూములపై బీఆర్ఎస్ నేతలు కన్నేశారని.. ఐడీపీఎల్ భూములను గద్దల్లా తన్నుకుపోయారని ఆయన దుయ్యబట్టారు. నల్గొండలో పుష్కలంగా యూరేనియం నిల్వలు వున్నాయని.. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే విపక్ష నేతలపై ఎదురుదాడి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంతకుముందు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని అధికార మోదీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నష్టాలను అందరికీ పంచి.. లాభాలను కొందరికి అంకితం చేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమనేది తెలంగాణ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో వివరంగా తెలియజేశారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పరంగా కూడా కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేశారు.  రైతు బీమాను ప్రవేశపెట్టినప్పుడు ప్రైవేట్ సంస్థలు ఉన్నప్పటికీ.. ఎల్‌ఐసీ అప్పగించారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేయడాన్ని మాటల్లోనే కాకుండా.. చేతల్లో చూపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

Also Read: ఇక్కడవి అమ్మేసి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటావా, బయ్యారంలో ఫ్యాక్టరీ పెట్టొచ్చుగా : కేసీఆర్‌పై భట్టి విమర్శలు

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటును పరిశీలిస్తామని విభజన చట్టంలోనే  ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు పెడతామని కేంద్రం  చెప్పిందని తెలిపారు. 2014 నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతూనే ఉన్నామనిచెప్పారు. కేంద్ర మంత్రులను కలిసిన ఎలాంటి  ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. తాను స్వయంగా ప్రధానిని  కలిశానని చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ పెడితే 15 నుంచి 20 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపానని అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ బయ్యారానికి సరఫరా చేస్తే బాగుంటుందని చెప్పానని తెలిపారు. 

బయ్యారం సమీపంలో బైలదిల్లా ఉందని.. అది 134 కోట్ల మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ లభించే గని అని అన్నారు. అయితే అప్పుడు కుట్ర జరుగుతుందని తమకు తెలియదని చెప్పారు. బైలదిల్లాను అదానీకి  కట్టబెట్టారని.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు చావు దెబ్బతిన్నాయని అన్నారు. అందుకే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఆచరణ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతారని విమర్శించారు. 
......
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ