బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదని.. కేవలం కో ఆర్ఢినేటర్ సెంటర్ అని అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి అన్నప్పుడు విపరీతమైన బాధ్యతలు ఉంటాయని చెప్పారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అరవింద్ ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ గురించి ప్రస్తావించగా.. ఆ వ్యాఖ్యలను తాను సమర్ధించనని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించనని.. బీజేపీకి దానికి సంబంధం ఉంది.. కానీ తానైతే ఒప్పుకోనని చెప్పారు. దానికి సంజాయిషీ బండి సంజయ్‌నే ఇచ్చుకోవాలని అన్నారు.
రాష్ట్ర అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదని.. కేవలం కో ఆర్ఢినేటర్ సెంటర్ అని అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి అన్నప్పుడు విపరీతమైన బాధ్యతలు ఉంటాయని.. ఆ మాటలను ఉపసంహరించుకోవాలని అన్నారు. తెలంగాణలో మస్తు సామెతలు ఉంటాయని.. వాటిని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బండి సంజయ్ చేసిన కామెంట్‌తో వారు ఆయుధం దొరికినట్టుగా చేస్తున్నారని విమర్శించారు. కవిత ఈడీ విచారణ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
అదే సమయంలో సీఎం కేసీఆర్ కుటుంబంపై ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత సహకరించలేదని తమకు ఉన్న సమాచారమని చెప్పారు. ఈడీ ప్రశ్నలకు కవిత.. ఏమో, తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలు చెబుతుందని తెలిపారు. ఈడీ విచారణకు సహకరించపోతే తొందరగా అరెస్ట్ చేస్తారని అన్నారు. అవినీతి రహిత దేశాన్ని రూపొందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అదే పని మీద ఉన్నాయని చెప్పారు. కుటుంబ పార్టీలు అవినీతిలో కూరుకుపోవడం జగమెరిగిన సత్యమని అన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో ముగిపోయిందని విమర్శించారు. కుటుంబ పార్టీలకు ఎంత దూరంగా ఉంటే.. వ్యాపారస్తులకు అంత మంచిందని అన్నారు.
కవిత తప్పు చేయనప్పుడు హడావిడి ఎందుకని ప్రశ్నించారు. కడిగిన ముత్యం అయితే.. ఈడీ విచారణకు సైలెంట్‌గా రావాలని అన్నారు. తప్పు చేయకుంటే ఈడీ ఏం చేస్తుందని అన్నారు. కేసీఆర్ కవిత మీద కాకుండా రాష్ట్ర ప్రజలపై దృష్టి పెట్టాలని అన్నారు. కవిత విచారణకు సహకరించలేదని ఎలా చెబుతున్నారని మీడియా ప్రశ్నించగా.. తాను పేపర్లు రాసిన మాటలే చెబుతున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. మీడియాకు ఉన్నట్టే తమకు కూడా సోర్సెస్ ఉంటయాని చెప్పారు. బీజేపీ అనేది క్లీన్ పార్టీ అని.. 99 శాతం క్లీన్‌గానే ఉంటుందని తెలిపారు.
ఇక, ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించే క్రమంలో.. ‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా…’ అంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అయితే కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
అటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు.. ఇటు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బండి సంజయ్‌కు, బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు.. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోవైపు బండి సంజయ్‌పై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్‌లలో బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేస్తున్నారు. జీహెచ్‌ఎంపీ మేయర్ విజయలక్ష్మితో పాటు.. పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు శనివారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లగా.. వారికి అపాయింట్‌మెంట్ లభించలేదు.