తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ దోపిడీ కొనసాగుతోందని... ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం తలోదిక్కు పారిపోవడం ఖాయమని ధర్మపురి అరవింద్ అన్నారు.
జగిత్యాల : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటలయుద్దం సాగుతోంది. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి కేసీఆర్ తాడిపడితే కొడుకు కేటీఆర్ మత్తులో తూగుతుంటాడని అన్నారు. ఇక కూతురు కవిత పైసల పిశాచి... ప్రజాధనం దోచుకోవడమే ఆమె పని అని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే కల్వకుంట్ల ఫ్యామిలీలోని నలుగురు నాలుగు దిక్కులకు పోతారని అరవింద్ అన్నారు.
జగిత్యాల నియోజకవర్గంలోని బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే బిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై బిజెపి ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పాలించి తెలంగాణను వంచిస్తే... స్వరాష్ట్ర ఏర్పాటుతర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ఈ పదేళ్ల పాలనలో అలాగే మోసగించిందని అన్నారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని... బిఆర్ఎస్ కే కాదు కాంగ్రెస్ కు ఓటేసినా సీఎం అయ్యేది కేసీఆరే అని అరవింద్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి వెనక్కి తగ్గిన సమయంలో ఎంతోమంది యువకులు బలిదానాలు చేసుకున్నారని అరవింద్ అన్నారు. ఆ చావుల పాపం,బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల ఉసురు తగిలే తెలంగాణలో కాంగ్రెస్ చనిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ను ఏదో ఉద్దరిస్తానని... అధికారంలోకి తెస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు... కానీ అది సాద్యమయ్యే పని కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి రేవంత్ కంటే ఎక్కువ తనకు తెలుసని అరవింద్ అన్నారు.
Read More బీజేపీ కీలక సమావేశం.. తెలంగాణ సహా మూడు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై చర్చ
ఇక తెలంగాణ ప్రజల సొమ్ము కొల్లగొట్టిన కేసీఆర్ కూతురు కవిత తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని బిజెపి ఎంపీ అన్నారు. ఆమె దోచుకున్న సొమ్మును రికవరీ చేసి ప్రజల ముందు ఉంచుతామన్నారు. కవితను తెలంగాణ ప్రజలు నమ్మడంలేదని గత ఎన్నికల ద్వారానే బయటపడింది... మళ్ళీ ఆమెకు అదే అనుభవం ఎదురవుతుందని అరవింద్ అన్నారు.
గతంలో గల్ఫ్ బాధితులకు అండగా ఓ బోర్డ్ ఏర్పాటుచేస్తామని కేసీఆర్ ప్రకటించారు... కానీ ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదని అరవింద్ గుర్తుచేసారు. తాజాగా
బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో లోనూ గల్ప్ బోర్డ్ ప్రస్తావనే లేదన్నారు. కాబట్టి గల్ఫ్ బాధితులు, వారి కుటుంబసభ్యులు సిరిసిల్లలో భారీగా నామినేషన్లు వేయాలని.. కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు తగిన బుద్ది చెప్పాలని అరవింద్ సూచించారు.
నవంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికే ప్రజలు పట్టం కడతారు... డిసెంబర్ మొదటివారంలో గెలిచిన బిజెపి ఎమ్మెల్యేల్లో ఒకరు తెలంగాణ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారరి అరవింద్ అన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసమైన తెలంగాణలో మోదీ సర్కార్ రావాలన్నారు. అధికారంలోకి రాగానే ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు.