బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరగనుంది. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
హైదరాబాద్: బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మంగళవారంనాడు సాయంత్రం ఆరున్నర గంటలకు న్యూఢిల్లీలో జరగనుంది. తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇవాళ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.ఇతర పార్టీల నుండి బీజేపీలోకి వలసలు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. దీంతో అభ్యర్థుల జాబితాను ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అయితే ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాల జాబితాను తొలి జాబితాలో ప్రకటించాలని కమలదళం భావిస్తుంది.
undefined
తెలంగాణ రాష్ట్రంలో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపనుంది. పార్టీ సీనియర్లను , ఎంపీలను, మాజీ మంత్రులను అసెంబ్లీ బరిలోకి ఆ పార్టీ దింపనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుమారు ఆరు వేల మంది బీజేపీ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 66 ధరఖాస్తులు వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఈ దఫా అధికారం దక్కించుకోవాలని బీజేపీ కొంతకాలం నుండి పావులు కదుపుతుంది. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు గాను ఆ పార్టీ చర్యలు చేపట్టింది. సునీల్ భన్సల్ నేతృత్వంలోని టీమ్ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విషయమై కేంద్రీకరించింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఒకే అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది. కానీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలను దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేటర్లను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలతో తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ ను పెంచింది.
also read:పోటీ చేసేందుకే బీజేపీకి అభ్యర్థులు లేరు: రాజ్‌నాథ్ వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్
ఈ నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించారు.ఈ నెల 1, 3 తేదీల్లో మహబూబ్ నగర్, నిజామాబాద్ లలో నిర్వహించిన బీజేపీ సభల్లో మోడీ పాల్గొన్నారు. ఈ నెల 6న నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్ధేశం చేశారు. ఈ నెల 10న కేంద్ర హోంశాఖ మంత్రి ఆదిలాబాద్ లో జరిగిన బీజేపీ సభలో పాల్గొన్నారు. అదే రోజున హైద్రాబాద్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఎన్నికల సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.