తెలంగాణ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో లిస్ట్ ఆలస్యం.. ఆ తర్వాతే విడుదల..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 21 తర్వాతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది.  ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆదివారం (అక్టోబర్ 15) రోజున 55 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఈ  నెల 18లోపు ప్రకటిస్తామని..ఆలోపై వామపక్షాలతో పొత్తులు, స్థానాలపై క్లారిటీ ఇస్తామని కూడా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 

అయితే ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో చాలా వరకు సీనియర్ నాయకుల పేర్లతో పాటు.. ఎక్కువగా వివాదస్పదం లేకుండా ఏకాభిప్రాయంతో కూడుకున్న స్థానాలే ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ పలుచోట్ల అసంతృప్తి గళాలు వినిపిస్తూనే ఉన్నాయి.  కొన్ని నియోజకవర్గాలకు చెందిన నేతల అనుచరులు ఏకంగా గాంధీ భవన్‌కు వెళ్లి నిరసనకు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ముఖ్య నేతలు.. అసంతృప్తులను బజ్జగించే పనిలో పడ్డారు. 

Latest Videos

మరోవైపు కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో ఎక్కువ స్థానాల్లో.. ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అందువల్ల రెండో జాబితాను విడుదల చేస్తే పెద్ద ఎత్తున అసంతృప్త జ్వాలలు ఎగసిపడే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇప్పుడే రెండో లిస్ట్ ప్రకటిస్తే.. రాహుల్ పర్యటన వేళ గొడవలు చోటుచేసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే, రాహుల్ పర్యటన సాగే నియోజకవర్గాల్లో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. 

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధినాయత్వం ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చిందని.. 10 స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు పూర్తైందని తెలుస్తోంది. అయితే సరైన సమయం చూసుకుని.. ఈ నెల 21 తర్వాత రెండో జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.

click me!