తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని తేల్చి చెప్పింది. ఇటీవలనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ విషయమై ప్రధాని మోడీతో చర్చించారు.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెల రోజుల్లో విద్యుత్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.ఈ సమయంలో కూడా విద్యుత్ బకాయిల అంశంపై ప్రధాని మోడీతో చర్చించారు. అంతేకాదు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి తో కూడా జగన్ ఈ విషయమై చర్చించారు. విభజన సమస్యలను కూడా పరిష్కరించాలని సీఎం జగన్ ప్రధానితో పాటు పలువురు మంత్రులను కలిసి కోరారు. విభజన సమస్యలు పరిష్కరించే విషయమై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. గత వారంలో ఈ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించాల్సిన రూ.3,441.78 కోట్లతో పాటు సర్ చార్జీని కూడ కలిపి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఆదేశించింది. 2014 జూన్ 2నుండి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్ ను సరఫరా చేసినందుకు డబ్బులు చెల్లించలేదని ఆ రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. విద్యుత్ సరఫరాకు సంబంధించి రూ. 3,441.78 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు సకాలంలో ఈ నిధులు చెల్లించనందుకు గాను లేటు ఫీజు కింద అదనంగా రూ.335.14 కోట్లు కూడా చెల్లించాలని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిల చెల్లింపు విషయంలో కూడ ఏపీ ప్రభుత్వం కోర్టులను కూడా ఆశ్రయించింది. తమకు ఏపీ నుండి డబ్బులు రావాలని కూడా తెలంగాణ కు చెందిన అధికారులు చెబుతున్నపరిస్థితి నెలకొంది.