టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో పోలీసులను ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.
హైదరాబాద్: టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అంశంలో శివ గణేష్ కాల్ డేటా, వాట్సాప్ మేసేజ్ లు ఎందుకు బయటపెట్టడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైద్రాబాద్ లో గురువారంనాడు మీడియాతో మాట్లాడారు. పరీక్షా కేంద్రంలో క్వశ్చన్ పేపర్ ఫోటో తీసిన వ్యక్తికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు శివగణేషన్ ఫోన్ నుండి ఎంతమందికి పేపర్ వెళ్లిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టెన్త్ క్లాస్ పరీక్షా కేంద్రంలోకి గోడదూకి వెళ్లి ఫోటో తీస్తుంటే పోలీసులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పించినట్టుగా ఉందని ఆయన ఆరోపించారు.
పరీక్ష ప్రారంభమయ్యాక ప్రశ్నాపత్రం బయటకు వస్తే పేపర్ లీక్ అంటారా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. బండి సంజయ్ కు ఉదయం 10:30 గంటలకు పేపర్ వచ్చిందన్నారు. టెన్త్ క్లాస్ పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమైందన్నారు.
also read:బండి సంజయ్ రిమాండ్ రద్దు: తెలంగాణ హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్
పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే పేపర్ లీకైందని మీడియాలో బ్రేకింగ్ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. హిందీ పేపర్ బయటకు వస్తే వరంగల్ సీపీ తేలిగ్గా మాట్లాడారని రఘునందన్ రావు గుర్తు చేశారు. కానీ 24 గంటల తర్వాత రాజద్రోహం కుట్ర జరిగిందని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ అంశంలో ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ అరెస్ట్ విషయంలో చోటు చేసుకున్న అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని రఘునందన్ రావు చెప్పారు. పేపర్ లీక్ అంశానికి రాజకీయ రంగు పులుముతున్నారని ఆయన విమర్శించారు.