
హన్మకొండ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల లీకేజీ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో విద్యార్థుల సమస్య కాస్త బిఆర్ఎస్ వర్సెస్ బిజెపిగా మారింది. టెన్త్ ప్రశ్నపత్రాలతో పాటు ఇటీవల టీఎస్ పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ కూడా బిజెపి పనేనని బిఆర్ఎస్... తమ అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ సర్కార్ తమను బద్నాం చేస్తోందని బిజెపి అంటోంది. ఈ పేపర్ల లీకేజీపై ఇరు పార్టీల నాయకులు మీడియాముందుకు వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈ టెన్త్ పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ, బండి సంజయ్ అరెస్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న పేపర్ల లీకేజీలు ముమ్మాటికీ బీజేపీ పనేనని మంత్రి ఆరోపించారు. ఈ లీకేజీ వెనక "నమో" కుట్రలు వున్నాయన్నారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న బండి సంజయ్ బిజెపి అధ్యక్షుడు కాగా ఏ2 గా ఉన్న ప్రశాంత్ బీజేపీ సంస్థ "నమో" పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ అని మంత్రి పేర్కొన్నారు. వీరిద్దరు కలిసి పథకం ప్రకారమే పేపర్ల లీకేజీకి కుట్రలు పన్ని నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మంత్రి ఆరోపించారు.
బండి సంజయ్ నిజంగానే నిజాయితీపరుడైతే... పేపర్ల లీకేజీలో అతడి హస్తం లేకుంటే పోలీసులకు తన మొబైల్ ఫోన్ ఎందుకు ఇవ్వడంలేదు? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఆ ఫోన్ పోలీసుల చేతిలో పడితే పేపర్ల లీకేజీలతో కేంద్రంలోని బిజెపి పాత్ర బయటపడుతుందని... అందువల్లే సంజయ్ ఫోన్ ఇవ్వడంలేదని మంత్రి అన్నారు. పథకం ప్రకారమే కేంద్రం, రాష్ట్ర బిజెపి నాయకులు పేపర్లను లీక్ చేసి తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు పన్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.
Read More టెన్త్ పేపర్ లీక్ కేసు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు షాక్.. నోటీసులు జారీ..
పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని... ఈ కుట్రలో స్వయంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వుండటం విచారకరమని అన్నారు. కొద్దిరోజులుగా తమ పథకాన్ని అమలుచేస్తున్నారని... పేపర్లు లీక్ చేస్తూ ఆ నేరాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారని అన్నారు. బిజెపి ట్రాప్ లో విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు పడొద్దని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేసారు.
పోలీసులు తమదైన పద్ధతిలో లీకేజీ లను ఛేదిస్తున్నారని... కుట్రలను బయటపెడుతున్నారని మంత్రి అన్నారు. బిజెపి చిల్లర రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడరు... ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలను తట్టుకొన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో కేసీఆర్ కు బాగా తెలుసని ఎర్రబెల్లి అన్నారు.
ఇటీవల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసారు... శ్రీరామనవమి రోజున మతాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నారని మంత్రి ఆరోపించారు. వరుసగా జరుగుతున్న ఈ కుట్రలన్నింటినీ సీఎం కేసీఆర్ చేదిస్తున్నారని అన్నారు.తెచ్చిన తెలంగాణను కాపాడుకోవడానికి కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని... ఆయన వెంట తామంతా వుంటామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.