కేసీఆర్ స్వయంగా ఎమ్మార్వో, ఎంపీడీవోలతో మాట్లాడే స్థాయికి దిగజారారు.. ఈటల రాజేందర్ ఫైర్

By Sumanth KanukulaFirst Published Nov 6, 2022, 2:25 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడిందని ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడిందని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను, ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ మట్టిలో కలిపారని విమర్శించారు. కేసీఆర్ అసలు రూపం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు తేడాను ప్రజలు తెలసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ఓటుకు రూ. 6 వేలు పంచిందని ఆరోపించారు. అది ఓటుకు నోటు కాదా అని ప్రశ్నించారు. మరి ఓటుకు డబ్బులు పంచినవారి మీద కేసులు ఎందుకు పెడతలేరని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చే హామీలు ఎన్నికల వరకే పరిమితమని విమర్శించారు. 

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడి జాప్యంలో అనుమానాలున్నాయని ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ఓడితే పెన్షన్లు రద్దు అవుతాయని మంత్రులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రులు పాలన వదిలి మునుగోడులో తిష్ట వేశారని.. ప్రత్యర్థులు ప్రచారం చేయకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు పోలింగ్ సిబ్బందిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మార్వో, ఎంపీడీవోలతో మాట్లాడే స్థాయికి దిగజారారని విమర్శించారు.

పోలింగ్ ముగిసినా టీఆర్ఎస్ నేతలు మునుగోడులోనే ఉన్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజాస్పందన తెలంగాణ ప్రజలకు మేలుకొలుపు కాబోతుందన్నారు. సీఎం కేసీఆర్ ఇతర పార్టీల  నాయకుల మీద నిఘా ఉంచుతున్నారని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే వారి ప్రేమను పొందే సంస్కారం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజల హృదయాల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారని.. ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లు తన వద్ద ఉండవద్దని కేసీఆర్ కోరుకుంటారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అమలు చేస్తున్న హింస, పంచుతున్న డబ్బు, మద్యంకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ దుర్మార్గాల మీద, ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. వాటిని అందరికి పంపుతామని చెప్పారు. మునుగోడులో కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని విమర్శించారు. 

click me!