కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై స్పందించారు హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ . మొన్ననే బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మాట ఎలా మార్చారని ఆయన ప్రశ్నించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఆయన నిర్ణయంపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. మొన్ననే బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మాట ఎలా మార్చారని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారే ముందు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఈటల అభిప్రాయపడ్డారు. రాజగోపాల్ల రెడ్డి రాజకీయాల్లో సీనియర్ నేత అని రాజేందర్ అన్నారు. ఆయన రాజీనామా లేఖను ఇంకా చదవలేదని ఈటల తెలిపారు.
మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హుజురాబాద్‌లోనే కాదు గజ్వేల్‌లోనూ ఈటల గెలవబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. ఎవరి బలం ఎంత అనేది ఎన్నికల్లో తేలిపోతుందని.. బీఆర్ఎస్ డబ్బు సంచులను నమ్ముకుందాని రాజేందర్ ఆరోపించారు. హుజురాబాద్ , గజ్వేల్‌లలో తానే గెలుస్తానని.. తాటాకూ చప్పుళ్లకు భయపడేది లేదని రాజేందర్ పేర్కొన్నారు.
ఇకపోతే.. బీజేపీ నాయకత్వం తీరుపై కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నెల 22న బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలకు చోటు దక్కలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో రెండు మూడు దఫాలు చర్చించారు. ఇవాళ ఉదయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్టుగా ప్రచారం సాగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ టిక్కెట్టు విషయమై హామీ ఇచ్చారని సమాచారం.
2022 ఆగస్టు మాసంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. గత కొంతకాలంగా బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.
బీజేపీలోని కొందరు నేతలు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారనే ప్రచారం కూడ సాగుతుంది. ఈ తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ నెల 27న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు న్యూడీల్లీకి వెళ్లనున్నారు.