ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీకి సిద్దమైన బిజెపి నేత ఈటల రాజేందర్ గజ్వేల్ లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ సర్కార్ పై, ప్రజలకు అందిస్తున్న పథకాలపై ఈటల కీలక వ్యాఖ్యలు చేసారు.
గజ్వేల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధుపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీకి సిద్దమైన ఈటల బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో లోపాలను ఎత్తిచూపిస్తున్నారు. ఇలా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ సర్కార్ అమలుచేస్తున్న రైతు బంధుపై కీలక వ్యాఖ్యలు చేసారు. రైతు బంధుతో చిన్న సన్నకారు రైతులతో పాటు వందల ఎకరాలు ఉన్నవారు, ఆదాయపు పన్ను కట్టేవారు సైతం పెట్టుబడి సాయం పొందుతున్నారని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ఇలా వుండదని... కేవలం పేద రైతులకే పెట్టుబడి సాయం అందిస్తామని ఈటల ప్రకటించారు.
గజ్వేల్ లో విజయశంఖారావం పేరిట ఈటల రాజేందర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... వందల ఎకరాల్లో వ్యవసాయం చేసేవారికి రైతు బంధు ఇవ్వడం సరికాదన్నారు. పేద రైతులకంటే అధిక భూమి వున్న పెద్ద రైతులకే ప్రభుత్వం అధిక పెట్టుబడి సాయం అందిస్తోందన్నారు. ఇలా వందల ఎకరాలున్న వారు లక్షలు పొందుతున్నారని... పేదరైతులు మాత్రం వేలతో సరిపెట్టుకుంటున్నారని అన్నారు.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే రైతు బంధు పథకంలో లోపాలను సరిచేస్తామని ఈటల ప్రకటించారు. కేవలం పెట్టుబడిసాయం అవసరమున్న చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు అందిస్తామని... వందల ఎకరాలున్న వారిని అనర్హులుగా నిర్ణయిస్తామన్నారు. ఇలా అర్హులైన రైతులకే పెట్టుబడి సాయం చేస్తూ ప్రభుత్వ ఖజానా కూడా ఖాళీ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఈటల రాజేందర్ ప్రకటించారు.
Read more Etela Rajender: "కడుపునొస్తే గోలిమందు దొరకని గ్రామాల్లో సైతం మద్యం ఏరులైపారుతోంది "
ఇప్పటికే దేశవ్యాప్తంగా 'పీఎం కిసాన్ యోజన' పేరిట కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ సాయం అందిస్తోంది. ఇదే తరహాలో తెలంగాణలో కూడా రైతుబంధుపై పరిమితి విధించనున్నట్లు ఈటల ప్రకటన సారాంశం.
కేసీఆర్ నియోజకవర్గంలో రైతుబంధు పథకంపై ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపే అవకాశాలున్నాయి. గతంలో బిఆర్ఎస్ గెలుపులో రైతు బంధు కీలకపాత్ర పోషించింది. దీంతో ఈసారి రైతుబంధులోని లోపాలను ఎత్తిచూపాలని... పేద రైతుల కంటే పెద్ద రైతులకే ఈ పథకం ద్వారా ఎక్కువడబ్బులు వస్తున్నాయని ప్రజలకు వివరించేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గజ్వేల్ లో రైతు బంధుపై కీలక వ్యాఖ్యలు చేసారు.