తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న ముసురు భారీ వర్షంగా మారింది. మరో రెండు రోజులు వర్షాల నేపథ్యంలో గురు, శుక్రవారాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించారు. గురు, శుక్రవారాలు స్కూల్లు ఉండవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
‘రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, తెలంగాణ సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నాం’ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు.
మరోవైపు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ఎడతెరిపి లేని వానలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. మరోవైపు వాణిజ్య రాజధాని అయిన ముంబైలో కూడా కొద్ది రోజులుగా కురుస్తున్న వానలు నగరాన్ని ముంచేస్తున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షం సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. దీంతో ముంబైలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ గురువారం నాడు సెలవు ప్రకటిస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులను అలర్ట్ చేశారు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.
భారీ వర్షాల నేపద్యంలో ముంబైలోని ప్రభుత్వ కార్యాలయాలను ఆ పరిసర ప్రాంతాల్లోని ఇతర ప్రైవేటు కార్యాలయాలు సముదాయాలను ముందుగానే మూసివేయాలని సూచించారు. త్వరగా మూసి వేయడం ద్వారా ప్రజలు తొందరగా ఇళ్లకు చేరుకుని వర్షానికి ప్రభావితం కాకుండా ఉంటారని తెలిపారు. ఇక ముంబైలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఎప్పుడు తెరవాలనేది.. పరిస్థితులను బట్టి స్థానిక యంత్రాంగం నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ముంబై తో పాటు పాల్గర్, రాయగఢ్ జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరోవైపు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ సూచన మేరకు రాయగడ్, పాల్గర్ జిల్లాల్లో కూడా నేడు స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు.
తెలంగాణలో భారీ వర్షాలు.. నేడు, రేపు స్కూళ్లకు సెలవులు.. pic.twitter.com/MmNInihEnO
— Asianetnews Telugu (@AsianetNewsTL)