
హైదరాబాద్ : బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రతిపక్ష పార్టీలన్నింటికీ షాకిస్తూ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ జాబితాలో కేసీఆర్ పేరు రెండుసార్లు కనిపించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. గజ్వెల్ తో పాటు ఈసారి కామారెడ్డి నుండి కేసీఆర్ పోటీకి సిద్దమయ్యారు. దీంతో ఇప్పటివరకు గజ్వెల్ లో స్ట్రాంగ్ అభ్యర్థిని బరిలోకి దింపాలనుకున్న బిజెపి, కాంగ్రెస్ లు ఇక కామారెడ్డిలోనూ అలాగే చేయాల్సి వస్తోంది. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోటీగా కామారెడ్డిలో విజయశాంతిని బిజెపి బరిలోకి దింపడానికి సిద్దమయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా విజయశాంతి స్పందించారు.
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పై ఎవరు పోటీచేస్తారనేది బిజెపి అదిష్టానం నిర్ణయిస్తుందని విజయశాంతి అన్నారు. బిజెపి నుండి ఎవరు బరిలోకి దిగినా గెలిపించుకోడానికి ప్రయత్నిస్తామని అన్నారు. కామారెడ్డిలో పోటీచేసేది నేనా లేక ఇంకెవరైనానా అన్నది త్వరలోనే తేలిపోతుందని విజయశాంతి అన్నారు.
ఏదేమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలుపు తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరమన్నారు విజయశాంతి. అయితే కేసీఆర్ పై ఎవరు పోటీచేయాలనేది పార్టీ నిర్ణయమని... కార్యకర్తలుగా ఆ ఆదేశాలను పాటించడం మాత్రమే తమ విధానమని అన్నారు.
Read More కేసీఆర్‌పై పోటీ చేయాలనే ప్రతిపాదన, సత్తా చూపుతాం: కూనంనేని సాంబశివరావు
గత రెండ్రోజులుగా కామారెడ్డిలో కేసీఆర్ పై విజయశాంతి పోటీచేస్తుందని పలు మీడియా మాద్యమాల్లో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని విజయశాంతి తెలిపారు. ఇదే విషయాన్ని తన సన్నిహితులు, అనుచరులతో పాటు చాలామంది అడుగుతున్నారని అన్నారు. అయితే బిజెపి అదిష్టానం ఏ ఇప్పటికయితే ఏ నిర్ణయం తీసుకోలేదని... తాను ఎక్కడ, ఎవరిపై పోటీచేయాలో పార్టీ నిర్ణయిస్తుందని విజయశాంతి అన్నారు.
గజ్వెల్, కామారెడ్డి రెండుచోట్ల కేసీఆర్ ను ఓడించడం తెలంగా ఉద్యమకారుల బాధ్యత అని విజయశాంతి అన్నారు. కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు కేసీఆర్ ఎలాంటివాడో, అతడి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి బయటపెట్టాలని విజయశాంతి కోరారు.