బీఆర్ఎస్ కనీసం మిత్ర ధర్మం కూడ పాటించలేదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
హైదరాబాద్: కేసీఆర్ పై పోటీ చేయాలనే ప్రతిపాదన వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. గురువారంనాడు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై పార్టీ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇండియా కూటమికి వెళ్లి మిత్రద్రోహం చేశామని బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు.
బీఆర్ఎస్ తో పొత్తు కంటే ముందే జాతీయ కూటమిలో కమ్యూనిస్టులున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.2004లో కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. కమ్యూనిస్టులంటే కేసీఆర్ కు నచ్చదన్నారు. కేసీఆర్ నిమిషానికో మాట మారుస్తారని సీఎం తీరును కూనంనేని సాంబశివరావు తప్పుబట్టారు. కనీస రాజకీయ విలులు కూడ కేసీఆర్ పాటించలేదని ఆయన మండిపడ్డారు.
సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు.సెప్టెంబర్ 11 నుండి బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 17న హైద్రాబాద్ లో భారీ సభను నిర్వహిస్తామన్నారు.ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా పాల్గొంటారని కూనంనేని సాంబశివరావు చెప్పారు. బీఆర్ఎస్ కు తమ సత్తా ఏమిటో చూపుతామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సీపీఐ,సీపీఎంలు మద్దతు ప్రకటించాయి. రానున్న ఎన్నికల్లో కూడ ఈ రెండు పార్టీలతో పొత్తు కొనసాగుతుందని గతంలో కేసీఆర్ ప్రకటించారు. కానీ, ఈ నెల 21 కేసీఆర్ 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
దీంతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ తీరును తప్పుబట్టారు. కనీసం తమతో చర్చించకుండా అభ్యర్థులను ప్రకటించడంపై కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 27వ తేదీ తర్వాత రెండు పార్టీల నేతలు మరోసారి సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో ఏఏ స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారో ప్రకటించే అవకాశం ఉంది.