పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తికాకుండానే ప్రారంభం చేయడానికి సీఎం కేసీఆర్ సిద్దమయ్యారని మాజీ మంత్రి పి.,చంద్రశేఖర్ అన్నారు.
మహబూబ్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని... అందువల్లే నిర్మాణంలో వుండగానే ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పూర్తికాకుండానే ప్రారంభించడానికి సిద్దమయ్యారని అన్నారు. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ గెలుపు సాధ్యంకాదని కేసీఆర్ కు అర్థమయ్యిందని... అందువల్లే ఇలాంటి పనులు చేస్తున్నారని చంద్రశేఖర్ అన్నారు.
రేపు(సెప్టెంబర్ 16న) పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం, కొల్లాపూర్ నియోజకవర్గంలో కేసీఆర్ భారీ బహిరంగసభ నేపథ్యంలో మహబూబ్ నగర్ బిజెపి కార్యాలయంలో పి.చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. మూడోసారి అధికారంలోకి వస్తామని... హ్యాట్రిక్ విజయం ఖాయమని పైకి గొప్పగా చెబుతున్నా బిఆర్ఎస్ గెలుపు కష్టమేనని కేసీఆర్ కు తెలుసని మాజీ మంత్రి అన్నారు. రైతు పొలాలను నీరు అందించిన తర్వాతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తే బావుంటుందన్నారు. అలాకాకుండా ఇంకా కాలువలు కూడా నిర్మించకుండానే ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభిస్తున్నారని చంద్రశేఖర్ అన్నారు.
మొదట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను రోజుకు రెండు టిఎంసిల చొప్పున 45 రోజుల్లో90 టిఎంసిల నీటిని లిప్ట్ చేసేలా ప్రణాళికలు రూపొందించారని మాజీ మంత్రి తెలిపారు. ఆ తర్వాత రోజుకు 1 టిఎంసి చొప్పున నీటిని ఎత్తిపోసేలా డిజైన్ మార్చారని అన్నారు. ఇప్పుడు కేవలం ఒక్కపంపుతో 3000 క్యూసెక్కుల నీరు ఎత్తిపోసేందుకు సిద్దమయ్యారని... ఈ నీళ్లు ఏ రైతు పొలంలొ పారిస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఎద్దేవా చేసారు.
Read More తెలంగాణ ఆలోచిస్తే దేశం ఆచరిస్తోంది... ఈ ఘనత కేసీఆర్ దే..: హరీష్ రావు
కేవలం ఎన్నికల కోసమే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు కేసీఆర్ సర్కార్ సిద్దమయ్యిందని చంద్రశేఖర్ ఆరోపించారు. పాలమూరు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి బిఆర్ఎస్ ఓటమి ఖాయమని... ప్రజలు, రైతాంగం కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని బిజెపి నేత పి.చంద్రశేఖర్ అన్నారు.