
తెలంగాణ బీజేపీ నేతల మధ్య అంతర్గత పోరు ముదురుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ వైఖరికి వ్యతిరేకంగా ఒక్కొక్కరు తమ గళం వినిపిస్తున్నారు. తాజాగా బండి సంజయ్‌పై ధర్మపురి బీజేపీ ఇన్‌చార్జ్ కన్నం అంజయ్య సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. దళిత నేతలను కావాలని అణగదొక్కుతున్నారని, పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
బండి సంజయ్‌పై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామని కన్నం అంజయ్య తెలిపారు. పార్టీలో చాలా కాలంగా ఉన్నవారికి న్యాయం జరగడం లేదన్నారు. తాను కడుపు మండి మాట్లాడుతున్నానని అన్నారు. పార్టీలో దళితుల మధ్య విభేదాలు పెట్టే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.
ఇక, ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై ఆ పార్టీలోనే పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ధర్మపురి అరవింద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించనని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించనని.. బీజేపీకి దానికి సంబంధం ఉంది.. కానీ తానైతే ఒప్పుకోనని చెప్పారు. దానికి సంజాయిషీ బండి సంజయ్‌నే ఇచ్చుకోవాలని అన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదని.. కేవలం కో ఆర్ఢినేటర్ సెంటర్ అని అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి అన్నప్పుడు విపరీతమైన బాధ్యతలు ఉంటాయని.. ఆ మాటలను ఉపసంహరించుకోవాలని అన్నారు. తెలంగాణలో మస్తు సామెతలు ఉంటాయని.. వాటిని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బండి సంజయ్ చేసిన కామెంట్‌తో బీఆర్ఎస్‌కు ఆయుధం దొరికినట్టుగా అయిందని అన్నారు.
అయితే అరవింద్ చేసిన కామెంట్స్‌కు బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ నుంచి మద్దతు లభించింది. ఆయన సోమవారం సంజయ్‌పై బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే సోషల్ మీడియాలో పోస్టు చేసిన శేఖర్.. కొంతసేపటికే ఆ పోస్టును తొలగించారు. ఆ పోస్టులో బండి సంజయ్ తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అరవింద్ చెప్పిన మాటలను ఆయన సమర్థించారు. ‘‘అరవింద్ చెప్పింది 100 శాతం కరెక్ట్. జి కిషన్ రెడ్డి లేదా కె లక్ష్మణ్ అతనిని సరిదిద్దాలి’’ అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లకు తగిన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక గెలుపుతో పార్టీలో ఊపు వచ్చిందని.. అయితే అంతర్గత సమస్యల వల్లే అది లేకుండా పోయిందని అన్నారు. బీఆర్‌ఎస్‌పై తీవ్రమైన పోరాటం జరగడం లేదన్నారు. రాష్ట్ర బీజేపీ ప్రస్తుతం మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి వేస్తోందన్నారు. అయితే ఈ పోస్టు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో.. అక్కడి నుంచి బహిరంగ ఆరోపణలు చేయవద్దని శేఖర్‌కు సూచన వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక, శేఖర్‌కి ఆర్‌ఎస్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది.