18 ఏళ్ల సోపతిలో నేనేంటో మీకు తెలియదా.. కుట్ర చేసి బయటకు పంపారు: కేసీఆర్‌పై ఈటల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 24, 2021, 8:25 PM IST
Highlights

ఇన్నేళ్ల సోపతిలో నేను మంచోన్నో.. చెడ్డోన్నో కేసీఆర్‌కు (kcr) తెలియదా? అన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender). కావాలనే కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో తనను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇన్నేళ్ల సోపతిలో నేను మంచోన్నో.. చెడ్డోన్నో కేసీఆర్‌కు (kcr) తెలియదా? అన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender). కావాలనే కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో తనను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో తాను వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగిందన్నారు. డీజిల్, పెట్రోలుపై పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తాయని ఈటల చెప్పారు. గ్యాస్ సిలిండర్‌పై వేసే 5 శాతం పన్నులో 22.67 రూపాయల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయని రాజేందర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా గ్యాస్, డీజిల్, పెట్రోలు ధరలుంటాయని పేర్కొన్నారు. సామాన్యులపై భారం పడుతుందనుకున్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగ్గించాలని రాజేందర్ డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 36 శాతం పన్ను విధిస్తోందని ఆయన తెలిపారు. కేసీఆర్ (kcr) పద్దెనెమిదిన్నర సంవత్సరాలు తమ్ముడిగా, మిత్రుడిగా, శిష్యుడిగా.. ఏ పని చెప్పినా.. శభాష్ అనిపించుకునేలా తాను పని చేశానని వెల్లడించారు. ఏ పదవి ఇచ్చినా దానికి వన్నె తెచ్చేలా పనిచేశానని రాజేందర్ గుర్తుచేశారు. కానీ పద్దెనెమిదిన్నర ఏళ్ల తర్వాత తనను ఎందుకు పంపించారో చెబుతారా అంటూ నిలదీశారు. వెన్నుపోటు పొడిచింది మీరా… నేనా? అంటూ ఈటల దుయ్యబట్టారు.

ALso Read:దేవుడి మాన్యం పంపకాల్లో గొడవే.. కేసీఆర్- ఈటల విడిపోవడానికి కారణం: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

బయటకు పంపినా బాధపడలేదని.. కానీ కొప్పుల ఈశ్వర్ (koppula eshwar), గంగుల కమలాకర్ (gangula kamalakar), వినోద్ కుమార్ (vinod kumar) లాంటి వాళ్లంతా.. తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని మండిపడ్డారు. గౌరవం లేని చోట ఉండకూడదని.. ఇజ్జత్ లేని బతుకు వద్దని పదవికి రాజీనామా చేసి వచ్చానని వెల్లడించారు. మీరిచ్చిన పదవే అయినా.. పూలమ్మిన చోట.. కట్టెలమ్మవద్దని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చానని రాజేందర్ స్పష్టం  చేశారు. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసి.. తన ముఖం అసెంబ్లీలో కనిపించకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2 వేల కోట్ల రూపాయల భూములమ్మి తనను ఓడించేందుకు దళిత బంధు తెచ్చారని రాజేందర్ ఆరోపించారు. దళితబంధు ఆపారని తన మీద దొంగ ఉత్తరం సృష్టించారని మండిపడ్డారు. తాను దళితబంధు ఆపుతానా? తాను హుజురాబాద్ లోని ప్రతి కుటుంబంలోనూ సభ్యున్ని అని అన్నారు. తనపై ఎవరో ఎందుకు..నీవే వచ్చి పోటీ చేయమని కేసీఆర్‌ను ఆయన వ్యాఖ్యానించారు. 


 

click me!