చక్రపాణిదో మాట.. కేటీఆర్‌ది ఇంకో మాట, ఏది నిజం: ఉద్యోగాల భర్తీపై డీకే అరుణ విమర్శలు

By Siva KodatiFirst Published Feb 26, 2021, 5:07 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పట్టభద్రులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అరుణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పట్టభద్రులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అరుణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఇప్పటివరకు 32 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశామని టీఎస్‌పీఎస్‌సీ మాజీ ఛైర్మన్‌ గంటా చక్రపాణి చెబుతుంటే.. మంత్రి కేటీఆర్‌ మాత్రం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఉద్యోగాల భర్తీ విషయంలో ఎవరు నిజం చెబుతున్నారో అర్థం కావడం లేదని అరుణ వ్యాఖ్యానించారు. సింగరేణిలో ఇచ్చిన వారసత్వ ఉద్యోగాలను సైతం కొత్త ఉద్యోగాల జాబితాలో చేర్చారని ఆమె మండిపడ్డారు.

ప్రస్తుత ఖాళీలకు, కేటీఆర్‌ ప్రకటించిన లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదని అరుణ విమర్శించారు. ఉద్యోగాల భర్తీ అంశంపై చర్చకు సిద్ధమని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ తన సవాల్‌ను స్వీకరించాలని ఆమె డిమాండ్‌ చేశారు.  

అంతకుముందు మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ బీజేపీ నేతలపై విమర్శలు కురిపించారు. ఉద్యమంలో నువ్వు వున్నావా అంటూ ప్రశ్నించారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లు సంజయ్ మాట్లాడుతున్నాడని సుమన్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్, కేటీఆర్‌లపై మాట్లాడే అర్హత సంజయ్‌కి లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది తాము అని సుమన్ స్పష్టం చేశారు. బీజేపీ 12 కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టిందని.. 2014 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు మీరు సిద్ధపడితే ఆంధ్రా ప్రజలు మీపై తిరగబడుతున్నారని సుమన్ మండిపడ్డారు. దేశంలోని మొత్తం సంపదను రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

జోనల్ వ్యవస్థకు సంబంధించిన ఫైల్ ఢిల్లీలో పెండింగ్‌లో ఉందని దానిని క్లియర్ చేయించాలని బీజేపీ నేతలకు సుమన్ సవాల్ విసిరారు. తెలంగాణలో లక్ష కంటే ఎక్కువ ఉద్యోగాలే ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.

పదవుల కోసం పెదవులు మూసుకున్న నాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు ఉద్యోగాల కోసం మాట్లాడుతున్నారంటూ సుమన్ ఎద్దేవా చేశారు. బీజేపీ దేశంలోని అన్ని సంస్థలకు టులెట్ బోర్డ్ తగిలించిందన్నారు.

click me!