తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్ట్రాటజీ ఖరారైనట్టేనా?

By Mahesh K  |  First Published Jul 4, 2023, 4:52 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం దాదాపు తన స్ట్రాటజీని ఖరారు చేసినట్టే అనిపిస్తున్నది. తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు అంతం పలికి ఏకతాటి మీదికి తెచ్చే కర్తవ్యాన్ని జీ కిషన్ రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తున్నది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల కీలక పాత్ర పోషించనున్నట్టు అర్థమవుతున్నది.
 


హైదరాబాద్: బీజేపీ అధిష్టానం ఎన్నికల ముంగిట సంస్థాగతంగా ప్రక్షాళన చేపట్టింది. నాలుగు రాష్ట్రాల బీజేపీ యూనిట్లకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చను నిజం చేస్తూ తెలంగాణలోనూ బీజేపీ నూతన అధ్యక్షుడిగా జీ కిషన్ రెడ్డిని నియమించారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఈ ఇద్దరి నియామకాలతోనే బీజేపీ అధిష్టానం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన స్ట్రాటజీని దాదాపు ఖరారు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

Latest Videos

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పలు ఫిర్యాదులు హైకమాండ్‌కు అందాయి. కొత్త నేతలు, పాత నేతల్లోనూ ఆయనపట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. బండి సంజయ్ దూకుడుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాడనడంలో సందేహం లేదు. కానీ, ఆయన అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం లేదనేది ప్రధాన ఆరోపణగా ఆయన మీద వచ్చింది. ఇటీవలి పరిణామాలే ఇందుకు నిదర్శనంగా మారాయి. అంతర్గత అసమ్మతి రాగాలు ఊపందుకున్నాయి. ఇందులో ప్రధానంగా తమకు ప్రాధాన్యం దక్కడం లేదనేదే ఎక్కువ మంది నుంచి వినిపించింది.

ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఏకంగా ఢిల్లీకి పిలిపించుకునీ మరి అధిష్టానం ఆరా తీసింది. జితేందర్ రెడ్డి, రఘునందన్ రావులు బాహాటంగా తెలంగాణ బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు.

Also Read: లోక్ సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్?.. మహారాష్ట్ర సీఎంగా అజిత్ పవార్ ముందస్తు డీల్!.. షిండే వర్గంలో భయాలు

మరోవైపు కాంగ్రెస్ బలపడి దూకుడు పెంచిన తరుణంలో బీజేపీ ఇలా అంతర్గత కుమ్ములాటలతో ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వడం అసాధ్యం. ఎన్నికల్లో బీజేపీ బలం ప్రధానంగా ఐక్యత. ఆ పార్టీ నేతల్లో విభేదాలు చాలా అరుదుగా మాత్రమే బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌లకు కీలక పదవులు ఇచ్చినట్టు తెలుస్తున్నది.

కిషన్ రెడ్డి మృదు స్వభావి, అందరితోనూ సన్నిహిత్యంగా మెలిగే వ్యక్తి. పాత, కొత్త నాయకులతోనూ ఆయన సత్సంబంధాలను మెయింటెయిన్ చేస్తున్నారు. కాబట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలోని అన్ని వర్గాలనూ ఏకం చేసి బరిలోకి దింపి నాయకత్వం వహించడానికి కిషన్ రెడ్డి సరైన ఎంపిక అని బీజేపీ అధిష్టానం భావించి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇకపోతే.. హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, మంత్రులంతా ఎన్నికల నియోజకవర్గంలో తిష్ట వేసినా ఈటల రాజేందర్ వీరోచితంగా పోరాడి విజయం సాధించారు. కేసీఆర్‌ను ఓడించడమే తప్ప మరో లక్ష్యం లేదని పలుమార్లు ప్రకటించుకున్న ఈటల రాజేందర్ మొదటి నుంచీ అప్పటి టీఆర్ఎస్‌లో ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇతర పార్టీ కీలక నేతలను దగ్గరగా చూశారు. ఆ పార్టీ గురించి స్పష్టమైన అవగాహన ఉన్న నేత. అందుకే ఈటల రాజేందర్‌ను ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించినట్టు తెలుస్తున్నది.

దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాత నేత, కొత్త నేత ఇద్దరూ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అందరినీ ఏకతాటి మీదికి తీసుకువచ్చే పని కిషన్ రెడ్డి నిర్వర్తిస్తే.. ఎన్నికలకు సంబంధించిన ప్రధాన పాత్రను ఈటల రాజేందర్ పోషించనున్నట్టు అర్థమవుతున్నది. కాబట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమైన బాధ్యతను ఈటల రాజేందర్‌కు అప్పగించారు.

click me!