కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ వివాదం.. రాజీనామాకు సిద్దమైన బీజేపీ కౌనిలర్లు.. మరింతగా పెరగనున్న పొలిటికల్ హీట్..

By Sumanth KanukulaFirst Published Jan 16, 2023, 12:10 PM IST
Highlights

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ పొలిటికల్ హీట్ నెలకొంది.

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ పొలిటికల్ హీట్ నెలకొంది. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్‌లో విలీన గ్రామాల కౌన్సిలర్లు ఈ నెల 20వ తేదీ వరకు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. దీంతో కౌన్సిలర్లపై ఒత్తిడి పెరిగింది. అయితే రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఆయా గ్రామాల్లోని బీజేపీ కౌన్సిలర్లు రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. బీజేపీ కౌన్సిలర్లు కాసర్ల శ్రీనివాస్, సుతారి రవి తమ పదవులకు రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 18లోపు రాజీనామా  చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దీంతో అక్కడ రాజకీయ వేడి మరింతగా  పెరిగింది. 

బీజేపీ కార్పొరేటర్లు రాజీనామా చేస్తే మిగిలిన కౌన్సిలర్లపై ఒత్తిడి మరింతగా పెరగనుంది. మరోవైపు రాజీనామా చేసిన కౌన్సిలర్లను తాము తిరిగి గెలిపించుకుంటామని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సంక్రాంతి తర్వాత మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలను మరింత ఉధృతం చేయనున్నట్టుగా రైతులు చెబుతున్నారు. ఇక, ఈ నెల 17న రైతు ఐక్య కార్యచరణ కమిటీ మరోమారు సమావేశం కానుంది. 

ఇదిలా ఉంటే.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు మానవ హక్కుల కమీషన్ (హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. రైతులపై విచక్షణారహితంగా దాడులు చేశారని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. కలెక్టర్, పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు. మాస్టర్ ప్లాన్‌లో తమ భూములను లాక్కోవడం తీవ్ర అన్యాయమేనని రైతులు తెలిపారు. 

click me!