సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డిల నుంచి రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. విపక్షాలు కూడా కేసీఆర్ ఫార్ములానే అనుసరించేలా ఉన్నాయి. బీజేపీ ఇది వరకే కేసీఆర్ తరహాలోనే ఈటల రాజేందర్‌ను రెండు చోట్ల పోటికి దింపగా.. అందులో గజ్వేల్ కూడా ఉన్నది. కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డిని కామారెడ్డి, కొడంగల్ నుంచి పోటీకి దించే అవకాశాలున్నాయి.
హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంలో మునిగిపోయాయి. దాదాపు నెల రోజులకు ముందుగానే 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. ఇతర పార్టీలను బీఆర్ఎస్ దాదాపు ఇరుకున పెట్టేసింది. బీఆర్ఎస్ ముందుగా జాబితా ప్రకటించడంతో కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. కేసీఆర్‌ను టార్గెట్ చేసుకునీ అభ్యర్థులను ఎంపిక చేస్తుండటం గమనార్హం. రెండు చోట్ల పోటీ చేస్తున్న కేసీఆర్ ఫార్ములానే బీజేపీ, కాంగ్రెస్ అనుసరించి ఆయనపైనే బలమైన నేతలను పోటీకి దింపే అవకాశాలు ఉన్నాయి.
సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని బీజేపీ ఇది వరకే ఈటల రాజేందర్‌ను ప్రకటించింది. సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయబోతున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌ను బీజేపీ బరిలోకి దించింది. ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్ సహా గజ్వేల్‌లోనూ పోటీ చేయబోతున్నట్టు తొలి జాబితాలో బీజేపీ ప్రకటించింది.
undefined
Also Read: రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై టీ బీజేపీ నేతల రియాక్షన్ ఇదే.. ‘ఆయన అనుకుంటే సరిపోతుందా?’
ఇదిలా ఉండగా, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలోనూ బలమైన నేతను బరిలో నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోటీకి నిలబెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. రేవంత్ రెడ్డిని కొడంగల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీకి దింపాలనే వ్యూహాన్ని కాంగ్రెస్ రచిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, కేసీఆర్ కొడుకు, మేనల్లుడు, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపైనా బలమైన నేతలను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు వివరించాయి.
మొత్తంగా సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీకి చేయనున్నారు. ఇదే ఫార్ములాను ఆయనపైనే పోటీకి దింపడానికి బీజేపీ, కాంగ్రెస్‌లు అమలు చేయబోతున్నాయి! కేసీఆర్ ఫార్ములానే బీజేపీ ఫాలో అవుతూ ఈటల రాజేందర్‌ను రెండు చోట్ల పోటీకి దింపింది. కాంగ్రెస్ కూడా ఇదే ఫార్ములాను అనుసరించి రేవంత్ రెడ్డిని కామారెడ్డితోపొటు కొడంగల్‌లోనూ పోటీకి దించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.
కాగా, బీజేపీ నుంచి సొంతగూటికి తిరిగి రానున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన సొంత నియోజకవర్గం మునుగోడుతోపాటు సీఎం కేసీఆర్ పై పోటీ చేయడానికి గజ్వేల్‌లోనూ తాను బరిలోకి దిగాలని అనుకుంటున్నానని, ఈ మేరకే కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేసీ వేణుగోపాల్ ముందుకు తీసుకెళ్లినట్టు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ రెండో జాబితా ఈ రోజు సాయంత్రం లేదా రేపు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.