‘అసంతృప్త నేతలు’ ఈటల, రాజగోపాల్‌కు అధిష్టానం పిలుపు.. గుడ్ న్యూస్ చెబుతారా? బుజ్జగింపులేనా?

By Mahesh KFirst Published Jun 23, 2023, 12:53 PM IST
Highlights

తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలకు అధిష్టానం ఢిల్లీకి రమ్మని కబురుపెట్టింది. రేపు వీరితో జేపీ నడ్డా, అమిత్ షాలు సమావేశం కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు వివరించాయి. పార్టీలో అసంతృప్తిగా ఉన్న వీరికి ఉన్నత స్థానం కట్టబెట్టి బాధ్యతలు పెంచి గుడ్ న్యూస్ చెబుతారా? లేక ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని బుజ్జగిస్తారా? వేచి చూడాలి.
 

హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో అసంతృప్తితో కొంత ఎడంగా ఉంటున్న పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, సీనియర్ నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. వీరిద్దరినీ ఈ రోజు హస్తినకు రమ్మన్నట్టు సమాచారం అందింది. తాజాగా రాష్ట్ర బీజేపీ మొదలు పెట్టిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి వీరు కొంత దూరంగా ఉన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు వీరిని పిలిపించుకోవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరితో రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు సమావేశం కాబోతున్నట్టూ తెలుస్తున్నది.

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణపైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. కర్ణాటకను కోల్పోయిన బీజేపీకి దక్షిణాదిలో ఇప్పుడు ప్రధానంగా తెలంగాణనే కనిపిస్తున్నది. కానీ, కర్ణాటకలో బీజేపీని ఓడించిన కాంగ్రెస్ తెలంగాణలోనూ పుంజుకుంటున్నది. కానీ, ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ బీజేపీ బలహీనడిపోతున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Latest Videos

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మళ్లీ గాడిలో పడటానికి, ప్రజలకు చేరువ కావడానికి ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని తీసుకుంది. పార్టీ కీలక నేతలు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాన్ని నిన్న మొదలు పెట్టింది. కానీ, 30 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమ ప్రారంభం రోజే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరుకాకపోవడం, ఈటల రాజేందర్ సాయంత్రంపూట జాయిన్ కావడం చర్చనీయాంశం అయింది.

Also Read: ‘ఇంటింటికి బీజేపీ’ కార్యక్రమానికి ఈటెల, కోమటిరెడ్డి రాజగోపాల్ దూరం.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే...

బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరుగుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. పార్టీలోకి వచ్చినప్పుడే బీజేపీ హామీ ఇచ్చినట్టుగా ఈటల రాజేందర్‌కు మంచి స్థానం ఇస్తారనే అభిప్రాయాలూ వచ్చాయి. కానీ, పార్టీలో మార్పు జరగలేదు. ఈటల రాజేందర్ ఆశించిన స్థానం లేదా పదవీ దక్కలేదు. దీంతో ఈటల రాజేందర్, మునుగోడులో ఓటమి తర్వాత రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ పార్టీ మారుతారనే చర్చ మొదలైంది.

ఈ వార్తలను రాజగోపాల్ రెడ్డి ఖండించలేదు. విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ ఖండించారు. అధిష్టానం తనకు ఇప్పుడు కాకున్నా మరికొంత సమయం తీసుకుని అయినా.. ఆశించిన స్థానాన్ని ఇస్తుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ పరిణామాలకు తోడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం మళ్లీ రాష్ట్రంలో పార్టీని దారిలోకి తేవాలని ఆలోచిస్తున్నది. అందుకే వీరిద్దరినీ ఢిల్లీకి పిలిపించుకున్నట్టు తెలుస్తున్నది. అయితే.. ఈటల రాజేందర్ ఆశించినట్టు ప్రమోషన్ ఉంటుందా? లేక వీరిద్దరనీ బుజ్జగించి ఎన్నికల ముందు కష్టపడాలని, ఆ తర్వాత అందుకు తగ్గ ఫలం అందిస్తామని చెబుతారా? అనేది వేచి చూడాల్సి ఉన్నది.

click me!