అన్నదాతలకు గుడ్ న్యూస్... తెలుగు రాష్ట్రాల్లో జోరందుకోనున్న వర్షాలు, ఆరెంజ్ అలర్ట్

Published : Jun 23, 2023, 12:37 PM ISTUpdated : Jun 23, 2023, 12:39 PM IST
అన్నదాతలకు గుడ్ న్యూస్... తెలుగు రాష్ట్రాల్లో జోరందుకోనున్న వర్షాలు, ఆరెంజ్ అలర్ట్

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు జోరందుకోనున్నాయని ఇరురాష్ట్రాల వాతవరణ శాఖ అధికారులు ప్రకటించారు. 

హైదరాబాద్ : ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాల్సి వున్నా ప్రతికూల వాతావరణ పరిస్ధితులతో ఆలస్యమయ్యింది. దీంతో వర్షాల కోసం రైతులు ఆకాశంవైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్దితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఏపీ మొత్తం విస్తరించిన రుతుపవనాలు మరో 24గంటల్లో తెలంగాణ మొత్తం విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో ఇప్పటికే ఏపీలో వర్షాలు మొదలవగా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

తెలంగాణలో పలుజిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో ఇప్పటికే కురుస్తున్న తేలికపాటి వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని తెలిపారు. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. మరో రెండ్రోజుల్లో మరికొన్ని రాష్ట్రాలకు వర్షాలు విస్తరించనున్నాయని అధికారులు వెల్లడించారు. 

జూన్ 25, 26 తేధీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరించారు. దీంతో ముందుజాగ్రత్తగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెలాఖరు లేదా జూలై మొదటివారం నుండి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విరివిగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఇక హైదరాబాద్ లో నేడు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 6 నుండి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. నిన్న  నగరంలోని పలుప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసాయి... ఇవాళ కూడా అలాంటి పరిస్థితే వుండనుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

Read More  Monsoon season: టెక్ సిటీలో భారీ వ‌ర్షాలు.. వాన‌కాల పరిస్థితుల‌ను ఎదుర్కునేందుకు సిద్ధ‌మైన బెంగ‌ళూరు

రుతుపవనాల విస్తరణ ఆలస్యం కావడంతో వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులు ఆందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు వర్షాలు కురవకపోవడంతో ఆకాశం వైపు చూసే పరిస్దితి నెలకొంది. ఇలాంటి సమయంలో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. 

ఇదిలావుంటే గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి బిఆర్ అంబేద్కర్ తెలిపారు.ఈ రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు.... శనివారం అక్కడక్కడ మోస్తారు వర్షాలు  పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.    

శుక్రవారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. 

ఇక రేపు(శనివారం) అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు పడే అవకాశాలు వున్నాయని తెలిపారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున  రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు జాగ్రత్తగా వుండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BRS Boycotts Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదుట బిఆర్ఎస్ నాయకుల నిరసన| Asianet News Telugu
Kavitha Pressmeet: నా రక్తం ఉడుకుతోంది KCRపై CMరేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కవిత | Asianet News Telugu