ఎగువ నుండి వస్తున్న భారీ వరద కారణంగా మూసీకి వరద పోటెత్తింది. దీంతో బీబీనగర్-పోచంపల్లి మధ్య ఉన్న లో లెవల్ వంతెనపై నుండి వరద నీరు ప్రవహిస్తుంది.
హైదరాబాద్: నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తింది. సోమవారంనాడు సాయంత్రం గంటన్నర పాటు కురిసిన వర్షం మూసీని ముంచెత్తింది. హైద్రాబాద్ నగరంలోని మలక్ పేట మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహించింది.
దీంతో ఈ బ్రిడ్జిపై నుండి రాకపోకలను నిలిపివేశారు. గోల్నాక వద్ద నిర్మించిన బ్రిడ్జిపై నుండి రాకపోకలకు పోలీసులు అనుమతిని ఇచ్చారు. ఎగువ నుండి మూసీకి వరద వస్తుండడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు చోట్ల లో లెవల్ వంతెనలపై నుండి వరద నీరు ప్రవహిస్తుంది.బీబీనగర్-పోచంపల్లి మధ్య లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న మూసీ వరద నీరు ప్రవహిస్తుంది.
దీంతో ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. బీబీనగర్, రుద్రవెల్లి, జూలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.ఈ మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని అధికారులు వాహనదారులకు సూచిస్తున్నారు.
మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుండి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 641.90 అడుగులు.పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు. మూసీకి ఇన్ ఫ్లో 2604 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుండి 4,310 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మూసీకి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దరిమిలా మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
హుస్సేన్ సాగర్ కూడ నిండుకుండలా మారింది.హుస్సేన్ సాగర్ కు వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ నుండి విడుదలైన నీరు కూడ మూసీలోకి చేరే అవకాశం ఉంది. దీంతో మూసీకి మరింత వరద వచ్చే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
also read:హైద్రాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు: పూర్తి స్థాయిలో నిండిన హుస్సేన్ సాగర్
తెలంగాణ రాష్ట్రంలో జూన్ మాసంలో ఆశించిన వర్షాలు కురవలేదు. అయితే ఈ మాసంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.