బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు: రేపు ఠాక్రేతో వెంకట్ రెడ్డి భేటీ

By narsimha lode  |  First Published Feb 14, 2023, 5:25 PM IST

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చేసిన పొత్తు వ్యాఖ్యలు కాంగ్రెస్  పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల వీడియోను  పార్టీ రాష్ట్ర ఇంచార్జీ  ఠాక్రే  పరిశీలించారు. రేపు  ఠాక్రేతో  కోమటిరెడ్డి భేటీ కానున్నారు. 
 



హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రేతో  బుధవారం నాడు  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ కానున్నారు. మాణిక్ రావు ఠాక్రే  మంగళవారం నాడు సాయంత్రం  హైద్రాబాద్ కు  రానున్నారు.  

2023  ఎన్నికల తర్వాత  కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  పొత్తు ఉంటుందని   కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు  చేశారు.ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను  మాణిక్ రావుఠాక్రే   తెప్పించుకొని  పరిశీలించారు. 

Latest Videos

హత్ సే హత్  జోడో  అభియాన్   కింద  కాంగ్రెస్ నేతల  పాదయాత్రల నిర్వహణ  విషయమై  మాణిక్ రావు ఠాక్రే  చర్చించేందుకు  ఇవాళ  హైద్రాబాద్‌కి  వస్తున్నారు.  ఈ సమయంలో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై  ఠాక్రే  చర్చించే అవకాశం ఉందని  పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  నేతల మధ్య రేవంత్ రెడ్డి వర్గానికి , సీనియర్ల మధ్య  గ్యాప్  ఉంది.  గతంలో  పార్టీ రాష్ట్ర ఇంచార్జీగా  ఉన్న మాణికం ఠాగూర్  రేవంత్ రెడ్డికి ఏకపక్షంగా  మద్దతు గా  నిలుస్తున్నారని  సీనియర్లు గుర్రుగా  ఉండేవారు.ఈ విషయమై  సీనియర్లు  బహిరంగంగా  విమర్శలు  చేయడంతో  దిగ్విజయ్ సింగ్  రాష్ట్ర పర్యటనకు వచ్చి పార్టీ నేతలతో  చర్చించారు.  దిగ్విజయ్ సింగ్  ఇచ్చిన  రిపోర్టు  ఆధారంగా  మాణికం ఠాగూర్  ను  తప్పించి  మాణిక్ రావు ఠాక్రేకు బాధ్యతలను అప్పగించారు.

మాణిక్ రావు  ఠాక్రే  రాష్ట్రంలో పార్టీ నేతలతో  వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశాల కోసం  ఇవాళ  ఠాక్రే  హైద్రాబాద్‌కి  వస్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలను   పార్టీ సీనియర్లు  తప్పుబడుతున్నారు.  బీఆర్ఎస్ తో  పొత్తు  వ్యాఖ్యలపై   కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని  రేపు ఠాక్రే  ప్రశ్నించే అవకాశం ఉందని  పార్టీ వర్గాల్లో  ప్రచారం  సాగుతుంది. అయితే  ఈ వ్యాఖ్యలపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఠాక్రేకు  ఏం సమాధానం చెబుతారోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో   కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చేసినట్టుగా  చెబుతున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్  క్రమశిక్షణ సంఘం  షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈ షోకాజ్ నోటీసులు చెత్తబుట్టకు పరిమితమయ్యాయని  కోమటిరెడ్డి వెంకంట్ రెడ్డి  గతంలో  వ్యాఖ్యలు  చేసిన విషయం తెలిసిందే.  

also read:పొత్తులపై రాహుల్ గాంధీ మాటలే ఫైనల్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి

పొత్తుల విషయమై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు  పార్టీకి నష్టం కల్గించేలా  ఉన్నాయని  సీనియర్లు  అభిప్రాయంతో  ఉన్నారు.  ఈ వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై  చర్యలు తీసుకోవాలని   మల్లు రవి పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఈ కామెంట్స్  ను ఆసరా చేసుకొని మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై  చర్యలకు   వైరి వర్గం డిమాండ్ చేస్తుంది.
 

click me!